భార్యని కబోర్డ్‌లో దాచిపెట్టిన పాక్ క్రికెటర్

     Written by : smtv Desk | Wed, Jul 01, 2020, 08:38 PM

భార్యని కబోర్డ్‌లో దాచిపెట్టిన పాక్ క్రికెటర్

ప్రపంచకప్‌ లాంటి మెగా టోర్నీలో ఆటగాళ్ల ఏకాగ్రతకి క్రికెట్ బోర్డులు అధిక ప్రాధాన్యమిస్తుంటాయి. కొన్ని దేశాల క్రికెట్ బోర్డులు ఆటగాళ్లతో ఉండేందుకు వారి భార్యా పిల్లల్ని, గర్ల్‌ఫ్రెండ్స్‌ని టోర్నీ ఆరంభం నుంచే అనుమతించరు. మరికొన్ని బోర్డులు మాత్రం లీగ్ దశ వరకూ అనుమతిస్తాయి. దాదాపు నెలన్నరపాటు వరల్డ్‌కప్ జరగనుండగా.. అలా భార్యా, పిల్లల్ని దూరంగా ఉంచడంపై ఆటగాళ్లు మొదటి నుంచి అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. కానీ.. క్రికెట్ బోర్డులు మాత్రం చిన్న చిన్న మినహాయింపులతో ఆ నిబంధనని అమలు చేస్తున్నాయి.

ఇంగ్లాండ్ వేదికగా 1999లో జరిగిన వన్డే ప్రపంచకప్‌కి పాకిస్థాన్ క్రికెట్ జట్టుతో పాటు క్రికెటర్ల భార్య, పిల్లల్ని కూడా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అప్పట్లో అనుమతిచ్చింది. కానీ.. టోర్నీ మధ్యలో పాకిస్థాన్ ప్రదర్శన ఆందోళనగా కనిపించడంతో.. వెంటనే ఫ్యామిలీ మెంబర్స్‌ని పాక్‌కి పంపాలని పీసీబీ ఆదేశించింది. కానీ.. తాను మాత్రం తన భార్యని పాక్‌కి పంపకుండా అక్కడే తన రూములో ఎవరికీ తెలియకుండా ఉంచుకున్నట్లు పాకిస్థాన్ దిగ్గజ స్పిన్నర్ సక్లైన్ ముస్తాక్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో బహిర్గతం చేశాడు. పాక్ క్రికెటర్లు రూల్స్‌ని పాటిస్తున్నారా.. లేదా అని తెలుసుకోవడానికి టీమ్ మేనేజర్, కోచ్‌ తదితరులు అప్పుడప్పుడు తనిఖీలకి వచ్చేవారని చెప్పుకొచ్చిన ముస్తాక్.. ఆ సమయంలో తన భార్యని కబోర్డ్‌లో దాచినట్లు వెల్లడించాడు.

‘‘వాస్తవానికి నాకు 1998, డిసెంబరులో వివాహమైంది. నా భార్య లండన్‌లోనే ఉండటంతో.. 1999 వరల్డ్‌కప్ సమయంలో ఆమెతో కలిసి టీమ్ బసచేసిన హోటల్‌లోని రూములో ఉండేవాడ్ని. పగలంతా టీమ్‌తో కలిసి ప్రాక్టీస్ చేయడం.. సాయంత్రం నుంచి ఆమెతో కలిసి సమయం గడిపేవాడ్ని. కానీ.. టోర్నీ మధ్యలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు.. వెంటనే ఫ్యామిలీ మెంబర్స్‌ని స్వదేశానికి పంపాలని క్రికెటర్లని ఆదేశించింది. దాంతో.. అప్పటి హెడ్ కోచ్ రిచర్డ్ పైబస్ వద్దకి వెళ్లి.. అంతా బాగా సాగిపోతోంది కదా..? మరి ఎందుకు ఈ మార్పు..? అని అడిగా. కానీ.. అతను ఒప్పుకోలేదు. దాంతో.. నేను కూడా నా భార్యని హోటల్ నుంచి పంపకూడదని నిర్ణయించుకున్నా. అయితే.. టీమ్ మేనేజర్, కోచ్ అప్పుడప్పుడు వచ్చి క్రికెటర్ల రూముల్ని తనిఖీ చేసేవారు. ఓ రోజు మేనేజర్ వచ్చి నా రూము తలుపు కొట్టాడు. దాంతో.. నా భార్యని కబోర్డ్‌లోకి వెళ్లి దాక్కోమని సూచించా. మేనేజర్ రూము మొత్తం ఒకసారి కలియ తిరిగి.. వెళ్లిపోయాడు. ఇంకో రోజు.. పీసీబీ అధికారి ఒకరు వచ్చి చెక్ చేశారు. అప్పుడు అదే ప్లాన్‌ని ఫాలో అయ్యా. ఆ వరల్డ్‌కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో పాకిస్థాన్ ఓడిపోయింది’’ అని సక్లైన్ ముస్తాక్ గుర్తు చేసుకున్నాడు.





Untitled Document
Advertisements