ఎట్టకేలకి ఐసీసీ ఛైర్మన్ పదవి నుంచి వైదొలిగిన శశాంక్ మనోహర్

     Written by : smtv Desk | Wed, Jul 01, 2020, 09:37 PM

ఎట్టకేలకి ఐసీసీ ఛైర్మన్ పదవి నుంచి వైదొలిగిన శశాంక్ మనోహర్

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఛైర్మన్ పదవి నుంచి శశాంక్ మనోహర్ వైదొలిగాడు. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సపోర్ట్‌తో 2015, నవంబరులో ఐసీసీ ఛైర్మన్ పదవిని చేపట్టిన శశాంక్ మనోహర్.. బీసీసీఐ ఆదాయానికే భారీగా గండికొట్టాడు. దాంతో.. మరోసారి అతను ఐసీసీ ఛైర్మన్‌గా కొనసాగే అవకాశం ఉన్నా.. బీసీసీఐ మాత్రం అందుకు అంగీకరించలేదు. బీసీసీఐ వ్యతిరేకతని ముందే పసిగట్టిన మనోహర్.. తాను మరోసారి పోటీచేయనని స్పష్టం చేశాడు.

ఐసీసీ మీటింగ్ బుధవారం జరగగా.. ఆ సమావేశం ముగిసిన తర్వాత శశాంక్ మనోహర్ వైదొలిగినట్లు అధికారికంగా ఐసీసీ ఓ ప్రకటనలో తెలిపింది. ఛైర్మన్ స్థానం భర్తీకి వారంలోపు నామినేషన్ ప్రక్రియ ప్రారంభిస్తామని అందులో పేర్కొన్న ఐసీసీ.. అప్పటి వరకూ డిప్యూటీ ఛైర్మన్ ఇమ్రాన్ ఖవాజా ఛైర్మన్‌ బాధ్యతలు చూస్తాడని తెలిపింది.

ఐసీసీకి భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ నుంచే ఎక్కువగా ఆదాయం వెళ్తుండటంతో.. బిగ్-3‌ని అప్పట్లో తెరపైకి తెచ్చిన ఎన్.శ్రీనివాసన్.. ఆదాయం పంపకాల్లోనూ ఆ మూడు దేశాలకి ఎక్కువ వాటా ఉండేటట్లు ఐసీసీలో రూల్‌ తీసుకొచ్చాడు. కానీ.. శశాంక్ మనోహర్.. ఆ బిగ్-3‌ని రద్దు చేయడంతో బీసీసీఐ రూ. వందల కోట్లు నష్టపోయింది. దానికితోడు.. బీసీసీఐకి అడుగడుగునా మనోహర్ అడ్డుపడుతూ వచ్చాడు.

ఆఖరికి పదవి నుంచి దిగిపోయే నెల ముందు అంటే జూన్ నెలలో కూడా శశాంక్ మనోహర్ బీసీసీఐని ఇరుకున పెట్టే ప్రయత్నం చేశాడు. ఆస్ట్రేలియా వేదికగా అక్టోబరు- నవంబరులో టీ20 వరల్డ్‌కప్ జరగాల్సి ఉండగా.. కరోనా వైరస్ నేపథ్యంలో ఆ టోర్నీకి తాము ఆతిథ్యమివ్వలేమని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) స్వయంగా తేల్చి చెప్పేసింది. అయినప్పటికీ.. టీ20 వరల్డ్‌కప్ వాయిదాపై ఐసీసీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దానికి కారణం.. శశాంక్ మనోహర్ అనేది బహిరంగ రహస్యమే. ఒకవేళ టీ20 వరల్డ్‌కప్ వాయిదాపడితే ఆ విండోలో ఐపీఎల్ 2020 సీజన్‌ని నిర్వహించుకోవాలని బీసీసీఐ ప్లాన్ చేయగా.. ఆ టోర్నీపై ఐసీసీ నాన్చుడు ధోరణిలో వ్యవహరించడంతో బీసీసీఐ ఎటూ తేల్చుకోలేకపోతోంది.





Untitled Document
Advertisements