రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో మోదీ చర్చలు!

     Written by : smtv Desk | Thu, Jul 02, 2020, 06:11 PM

రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో మోదీ చర్చలు!

భారత్‌కు చిరకాల మిత్రదేశం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌తో ప్రధాని మోదీ చర్చలు జరిపారు. గురువారం (జులై 2) మధ్యాహ్నం ఇరు దేశాల అధ్యక్షులు ఫోన్‌ ద్వారా సంప్రదింపులు జరిపారు. ఈ సందర్భంగా కీలక అంశాలు చర్చకు వచ్చాయి. అన్ని రంగాల్లో ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగాస్వామ్యాన్ని పటిష్టం చేసేందుకు కట్టుబడి ఉన్నామని ఈ సందర్భంగా ప్రధాని మోదీతో పుతిన్ పేర్కొన్నారు. చైనాతో సరిహద్దులో ఉద్రిక్తత వాతావరణం నెలకొని ఉన్న వేళ ఇరు దేశాల చర్చలకు ప్రాధాన్యం సంతరించుకుంది.

రష్యాలో రాజ్యాంగ సవరణలపై విజయవంతంగా ఓటింగ్‌ను పూర్తి చేసినందుకు అధ్యక్షుడు పుతిన్‌ను ప్రధాని అభినందించారు. రెండో ప్రపంచ యుద్ధంలో విజయం సాధించి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జూన్24న మాస్కోలో విక్టరీ పరేడ్ ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భారత్ తరఫున రక్షణ శాఖా మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పాల్గొన్నారు. ఈ వేడుకల గురించి కూడా పుతిన్‌తో మోదీ ప్రస్తావించారు. భారత్‌ - రష్యా ప్రజల మధ్య స్నేహానికి సంకేతంగా విక్టరీ పరేడ్‌లో భారతీయ సైనిక బృందం పాల్గొందని ప్రధాని పేర్కొన్నారు.

ఈ ఏడాది చివర్లో భారత్‌లో ఇరుదేశాల మధ్య వార్షిక ద్వైపాక్షిక సదస్సు నిర్వహించే అంశంపై ఇరువురు నేతలు చర్చించారు. ద్వైపాక్షిక సదస్సుకు భారత్‌కు రావాలని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను ప్రధాని మోదీ ఆహ్వానించారు. తనకు ఫోన్‌ చేసిన ప్రధాని మోదీకి పుతిన్ ధన్యవాదాలు తెలిపారు.

కొవిడ్‌-19 ప్రతికూల ప్రభావాన్ని అధిగమించేందుకు చేపట్టిన చర్యలను ఇరువురు నేతలు సమీక్షించారు. కొవిడ్‌-19 అనంతరం ప్రపంచానికి ఎదురయ్యే సవాళ్లను సంయుక్తంగా ఎదుర్కొనేందుకు ఇరు దేశాల మధ్య సన్నిహిత సంబంధాలు అవసరమని ఇరువురు నేతలు అభిప్రాయపడ్డారు.





Untitled Document
Advertisements