కోచ్ మెడపై కత్తి పెట్టిన పాక్ క్రికెటర్...క్లారిటీ ఇచ్చిన పాక్ క్రికెట్ బోర్డు!

     Written by : smtv Desk | Sat, Jul 04, 2020, 11:44 AM

కోచ్ మెడపై కత్తి పెట్టిన పాక్ క్రికెటర్...క్లారిటీ ఇచ్చిన పాక్ క్రికెట్ బోర్డు!

భారత మాజీ బ్యాటింగ్ కోచ్ గ్రాంట్ ఫ్లవర్ మెడపై సరదాగానే అప్పట్లో బ్యాట్స్‌మెన్ యూనిస్ ఖాన్ కత్తి పెట్టాడని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) వివరణ ఇచ్చింది. 2014 నుంచి 2019 వరకూ గ్రాంట్ ఫ్లవర్.. పాకిస్థాన్ బ్యాటింగ్ కోచ్‌గా పనిచేశాడు. పాకిస్థాన్ జట్టు 2016లో ఆస్ట్రేలియా పర్యటనకి వెళ్లగా.. బ్రిస్బేన్‌ టెస్టు మ్యాచ్‌కి ముందు బ్రేక్‌ఫాస్ట్ చేస్తున్న యూనిస్ ఖాన్‌కి గ్రాంట్ ఫ్లవర్ ఏదో బ్యాటింగ్ సలహా ఇవ్వబోయాడట. దాంతో.. చిర్రెత్తిపోయిన యూనిస్ తన మెడపై కత్తి పెట్టినట్లు గురువారం గ్రాంట్ ఫ్లవర్ ఆరోపించాడు. గ్రాంట్ ఫ్లవర్ ఏమన్నాడంటే..? ‘‘యూనిస్ ఖాన్‌ని హ్యాండిల్ చేయడం చాలా కష్టం. బ్రిస్బేన్‌లో జరిగిన ఘటన నాకు ఇంకా గుర్తుంది. ఓ టెస్టు మ్యాచ్‌కి ముందు బ్రేక్‌ఫాస్ట్ చేస్తుండగా.. యూనిస్‌కి బ్యాటింగ్‌పై ఓ చిన్న సలహా ఇవ్వబోయాను. అంతే.. అతను కోపంతో కత్తిని తీసి నా మెడపై ఉంచాడు. దాంతో నా పక్కనే కూర్చుని ఉన్న చీఫ్ కోచ్ మిక్కీ ఆర్థర్ కూడా షాక్‌లో ఉండిపోయాడు’’ అని గ్రాంట్ ఫ్లవర్ వెల్లడించాడు. ప్రస్తుతం శ్రీలంక జట్టుకి బ్యాటింగ్‌ కోచ్‌గా గ్రాంట్ ఫ్లవర్ పనిచేస్తుండగా.. పాకిస్థాన్ జట్టు బ్యాటింగ్ కోచ్‌గా యూనిస్ ఖాన్ ఇటీవల బాధ్యతలు చేపట్టాడు.

గ్రాంట్ ఫ్లవర్ ఆరోపణలపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు స్పందించింది. ‘‘యూనిస్ ఖాన్ ఏదో సరదాగా అలా గ్రాంట్ ఫ్లవర్ మెడపై కత్తి (బటర్ నైఫ్) ఉంచాడు. బ్రేక్‌ఫాస్ట్ చేస్తుంటే నీ సలహాలేంటి..? ఫస్ట్ నన్ను బ్రేక్‌ఫాస్ట్ ఫినిష్ చేయనివ్వు. ఇక్కడ సలహాలివ్వద్దు అని యూనిస్ ఖాన్ చెప్పాడు. అయినా.. కోచ్‌గా పనిచేసిన వాళ్లు.. వాళ్ల కాంట్రాక్ట్ ముగిసిన తర్వాత ఇలాంటి విషయాలు బహిర్గతం చేయడం సమజసం కాదు. గ్రాంట్ ఫ్లవర్ వార్తల్లో నిలిచేందుకు ఆ ఘటనకి మసాలాని జోడించాడు’’ అని పీసీబీ అధికారి ఒకరు మండిపడ్డాడు. ఇంగ్లాండ్ పర్యటనకి గత ఆదివారం బయల్దేరి వెళ్లిన పాకిస్థాన్ జట్టు ఇప్పుడు అక్కడ క్వారంటైన్‌లో ఉంది. అక్కడే బ్యాటింగ్ కోచ్ యూనిస్ ఖాన్ కూడా ఉన్నాడు.





Untitled Document
Advertisements