షాకింగ్: అమాంతం పెరిగిన టమోటా ధర...!

     Written by : smtv Desk | Sat, Jul 04, 2020, 04:29 PM

షాకింగ్: అమాంతం పెరిగిన టమోటా ధర...!

కరోనా వైరస్ దెబ్బకి ప్రజలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆదాయం తగ్గిపోవడంతో ఈఎంఐలు, చీటీలు కట్టలేకపోతున్నారు. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో సామాన్యులకు మరో ఝలక్ తగిలింది. దేశంలో పలు ప్రాంతాల్లో కూరగాయల ధరలు భారీగా పెరిగాయి. దీంతో పేదలకు, మధ్యతరగతి ప్రజలకు చుక్కలు కనిపిస్తున్నాయి.

టమోటా ధరలు భారీగా పెరిగాయి. కొన్ని రోజుల కిందట కేజీ టమోటా ధర రూ.10 నుంచి రూ.15 వరకు ఉండేది. అయితే ఇప్పుడ టమోటా ధర కేజీకి ఏకంగా రూ.70 నుంచి రూ.90 వరకు పలుకుతోంది. కేవలం టమోటాలు మాత్రమే కాకుండా ఇతర కూరగాయల ధరలు కూడా పెరిగాయి.

టమోటా ధరల పెరుగుదలకు ప్రధాన కారణం పంట దిగుబడి తగ్గిపోవడం. వర్షాల కారణంగా టమోటా పంట దిగుబడి సడన్‌గా పడిపోయింది. దీంతో డిమాండ్‌కు తగ్గ సరఫరా లేదు. ఈ నేపథ్యంలో టమోటా ధరలు ఆకాశాన్ని తాకాయి. అంతేకాకుండా డీజిల్ ధర పెరగడం కూడా టమోటా రవాణాపై ప్రభావం చూపుతోంది. వీటి రవాణా వ్యయాలు పెరిగాయి. దీంతో ట్రేడర్లు హోల్‌సెల్ మార్కెట్‌లోనే కేజీకి రూ.50 చెల్లిస్తున్నారు.

ఉర్ల గడ్డ (పొటాటో, బంగాళాదుంప) ధరలు కూడా పైపైకి కదులుతున్నాయి. కొన్ని రోజుల కిందట పొటాటో ధర కేజీకి రూ.20గా ఉండేది. కానీ ఇప్పుడు ధర రూ.30కు పెరిగింది. చిప్సోనా పొటాటో ధర కేజీకి రూ.40 వరకు పలుకుతోంది.

టమోటా, బంగాళాదుంప ధరలు మాత్రమే కాకుండా ఇతర కూరగాయల ధరలు కూడా పెరిగాయి. బెండకాయ ధర ఇప్పుడు మార్కెట్‌లో కేజీకి రూ.30 నుంచి రూ.40 వరకు ఉంది. అలాగే క్యాప్సికమ్, బీన్స్ ధర కూడా కేజీకి రూ.60 నుంచి రూ.80 వరకు ఉంది. కాలీఫ్లవర్ ధర కేజీకి రూ.40 నుంచి రూ.60 వరకు పలుకుతోంది. వంకాయ ధర కూడా కేజీకి రూ.30 వరకు ఉంది.





Untitled Document
Advertisements