తెలంగాణ సచివాలయ 132ఏళ్ల ఘన చరిత్ర తెలుసా?

     Written by : smtv Desk | Tue, Jul 07, 2020, 05:59 PM

తెలంగాణ సచివాలయ 132ఏళ్ల ఘన చరిత్ర తెలుసా?

ప్రస్తుతం ఉన్న తెలంగాణ సచివాలయాన్ని కూల్చివేసి సరికొత్త హంగులతో కొత్త సచివాలయాన్ని నిర్మించేందుకు టీఆర్ఎస్ సర్కార్ సంకల్పించింది. ఇందుకోసం సచివాలయ కూల్చివేత పనులకు నేటి నుంచి శ్రీకారం చుట్టింది. మంగళవారం తెల్లవారుజాము నుంచే సచివాలయ కూల్చివేత పనులు ప్రారంభమయ్యాయి. సచివాలయం వెళ్లే రహదారులను పోలీసులు మళ్లీస్తున్నారు. అధికారుల పర్యవేక్షణలో సచివాలయ కూల్చివేత పనులు వేగంగా సాగుతోన్నాయి. త్వరలోనే కొత్త సచివాలయ నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి.

ఇదిలా ఉంటే ప్రస్తుతం కూల్చివేస్తున్న తెలంగాణ సచివాలయాన్ని ఘనమైన చరిత్ర ఉంది. నిజాం కాలం చరిత్రకు నేటి వరకు సజీవ సాక్ష్యంగా ఈ కట్టడం నిలిచింది. తెలంగాణ సచివాలయ భవనానికి 132ఏళ్ల ఘన చరిత్ర ఉంది. నిజాం నవాబుల పాలనలో ఈ కట్టడం సైఫాబాద్ ప్యాలెస్ పేరుతో ప్రసిద్ధి గాంచింది. ఎంతోమంది ముఖ్యమంత్రులు ఈ భవనాన్ని పాలన కేంద్రంగా చేసుకొని పరిపాలన సాగించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పలువురు ముఖ్యమంత్రులు ఇక్కడి నుంచే పాలన సాగించారు.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటయ్యాక కూడా ఇప్పుడున్న సచివాలయమే పాలనా కేంద్రంగా మారింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సీఎంతో కలిపి మొత్తం 16మంది సీఎంలు ఇక్కడి నుంచి పాలన సాగించారు. 132ఏళ్లలో ఈ భవనంలో మొత్తం 10 బ్లాకుల నిర్మాణం జరిగింది. 25ఎకరాల విస్తీర్ణంలో పది లక్షల చదరపు అడుగుల్లో ఈ సచివాలయం నిర్మించబడింది. ఇందులో అతిపురాతనమైన జి బ్లాక్. 1888 సంవత్సరంలో నాటి 6వ నిజాం ఈ బ్లాక్ నిర్మించారు. 2003లో డి బ్లాక్, 2012లో నార్త్, సౌత్ బ్లాక్స్ ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం ఈ సచివాలయం ఇక గత చరిత్రగా మిగలబోతుంది.

ప్రస్తుతం ఉన్న సచివాలయంలో భద్రతా ప్రమాణాలు లేవని కేసీఆర్ సర్కార్ భావించింది. దీంతో అన్ని హంగులతో కొత్త సచివాలయాన్ని నిర్మించాలని ప్రభుత్వం పూనుకుంది. ఇందుకోసం సీఎం కేసీఆర్ కొత్త సచివాలయ నిర్మాణానికి శంకుస్థాపన కూడా చేయించారు. పాత సచివాలయాన్ని కూల్చి కొత్త సచివాలయం నిర్మించాలని భావించడాన్ని వ్యతిరేకిస్తూ ప్రతిపక్షాలు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై సుదీర్ఘంగా వాదనలు విన్న హైకోర్టు పాలనపరమైన విషయంలో జోక్యం చేసుకోవద్దని భావించడంతో ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వచ్చింది. దీంతో ప్రభుత్వం ప్రస్తుత సచివాలయాన్ని కూల్చివేత పనులను షూరు చేసింది.

తెలంగాణలో ప్రస్తుతం కరోనా కేసులు పెరుగుతున్నందున ఈ కట్టడాన్ని కోవిడ్ ఆస్పత్రిగా మార్చి ప్రజలకు సేవలందించాలని ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు డిమాండ్ చేశాయి. అయితే ఈ డిమాండ్లను ప్రభుత్వం మాత్రం పెద్దగా పట్టించుకోకుండా సచివాలయం కూల్చివేతకే మొగ్గుచూపింది. నేటి ఉదయం నుంచే పనులు మొదలు కావడంతో నిజాం కాలంలో నిర్మించిన ఈ సచివాలయం ఘన చరిత్ర కాస్తా గతచరిత్రగా మారనుంది.





Untitled Document
Advertisements