"వన్డేలో రీఎంట్రీ కోసం ఎదురుచూపులు"

     Written by : smtv Desk | Sun, Jul 12, 2020, 06:05 PM


భారత వన్డే జట్టులోకి రీఎంట్రీ కోసం తాను ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ అజింక్య రహానె వెల్లడించాడు. గత రెండేళ్లుగా వన్డే, టీ20లకి దూరమైన రహానె.. కేవలం టెస్టుల్లో మాత్రమే ఆడుతున్నాడు. టెస్టు జట్టులో అతనికి వైస్ కెప్టెన్ హోదాని ఇచ్చిన భారత సెలక్టర్లు.. వన్డే, టీ20ల్లో మాత్రం కనీసం జట్టులో కూడా చోటివ్వకపోవడం గమనార్హం. 32ఏళ్ల రహానె ఆఖరిగా 2018, ఫిబ్రవరిలో వన్డే మ్యాచ్ ఆడాడు.



భారత మాజీ వికెట్ కీపర్ దీప్ దేశ్‌గుప్తతో ఈఎస్‌పీఎన్ ఛాట్ షోలో అజింక్య రహానె మాట్లాడుతూ ‘‘వన్డే జట్టులో ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేసేందుకు నేను రెడీ. ఓపెనర్‌గా ఆడమన్నా లేదా నెం.4లో బ్యాటింగ్ చేయమన్నా నాకు ఓకే. ప్రస్తుతం వన్డేల్లో రీఎంట్రీ నా టార్గెట్. ఒకవేళ అవకాశం దొరికితే మూడు ఫార్మాట్లలోనూ ఆడటానికి నేను మానసికంగా సిద్ధమయ్యా. వన్డేల్లో ఓపెనర్‌గా ఆడటాన్ని నేను బాగా ఆస్వాదిస్తా. అలానే నెం.4లో కూడా’’ అని వెల్లడించాడు.

భారత జట్టులోకి 2011లో ఎంట్రీ ఇచ్చిన అజింక్య రహానె ఇప్పటి వరకూ 65 టెస్టులు, 90 వన్డేలు ఆడాడు. టెస్టుల్లో 42.89 సగటుతో 4,203 పరుగులు చేసిన ఈ మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్.. వన్డేల్లో 35.26 సగటుతో 2,962 పరుగులు మాత్రమే చేశాడు. దాంతో.. అతనిపై వేటు వేసిన భారత సెలక్టర్లు.. గత ఏడాది నుంచి నెం.4లో శ్రేయాస్ అయ్యర్‌ని ఆడిస్తున్నారు.





Untitled Document
Advertisements