కూతురి పెళ్లి కోసం పాత నోట్లను దాచిపెట్టిన తల్లి

     Written by : smtv Desk | Sun, Jul 12, 2020, 06:11 PM

కూతురి పెళ్లి కోసం పాత నోట్లను దాచిపెట్టిన తల్లి

వారిది రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబం. రెక్కలు ముక్కలు చేసుకొని సంపాదిస్తున్న సొమ్ములోంచి కొంత మొత్తాన్ని ఆ తల్లి కొన్నేళ్లుగా దాచిపెడుతోంది. ప్లాస్టిక్ కవర్‌లో మూటగట్టి ఇంటి వెనుక గోతి తీసి పాతిపెట్టింది. బధిరురాలైన తమ కుమార్తె పెళ్లి కోసం ఆ డబ్బును భద్రంగా దాచిపెట్టింది. ఇటీవల ఆ పేద కుటుంబానికి ప్రభుత్వం ఇళ్లు మంజూరు చేసింది. కూలీలు తవ్వుతుండగా.. ఆ ప్లాస్టిక్ మూట బయటపడింది. ఆ కవర్‌లో ఉన్న డబ్బంతా తాను కూడబెట్టిందేనని మహిళ చెప్పింది.

ఆ డబ్బునంతా తమ ఖాతాలో డిపాజిట్ చేద్దామని దంపతులిద్దరూ బ్యాంక్‌కు వెళ్లారు. అక్కడ అధికారులు చెప్పిన మాటలు విని షాక్‌కు గురయ్యారు. ఎందుకంటే.. అవన్నీ నాలుగేళ్ల కిందట రద్దైన రూ.1000, రూ.500 నోట్లే. వాటి మొత్తం విలువ రూ.35,500. ఆ నోట్లు ఇప్పుడు చెల్లవని అధికారులు చెప్పడంతో వాళ్లు లబోదిబోమంటున్నారు. తమిళనాడులోని నాగపట్టణం జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది.

నాగపట్టణం జిల్లా కొళ్లిడం సమీపంలోని పట్టియమేడుకు చెందిన రాజదురై, ఉష దంపతులు నిరక్షరాస్యులు. ఉష కూలీ పనులకు వెళ్లి సంపాదించిన నగదును కుమార్తె వివాహం కోసం దాచిపెట్టింది. ప్లాస్టిక్‌ సంచిలో మూటగట్టి ఇంటి వెనుక గుంత తవ్వి పాతిపెట్టింది. తాజాగా ఇంటి నిర్మాణ పనుల్లో ఆ డబ్బు బయటపడింది. అయితే.. ఆ పెద్ద నోట్లను కేంద్రం ప్రభుత్వం రద్దు చేసిన విషయం వారికి ఇప్పటికీ తెలియదు.

అవన్నీ రద్దయిన నోట్లని చెప్పడంతో దంపతులిద్దరూ దిగ్భ్రాంతి చెందారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నారు.





Untitled Document
Advertisements