బైరామల్‌గూడ ఫ్లైఓవర్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

     Written by : smtv Desk | Mon, Aug 10, 2020, 01:00 PM

బైరామల్‌గూడ ఫ్లైఓవర్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

హైదరాబాద్ నగరంలోని బైరామల్‌గూడ ఫ్లైఓవర్‌ను మంత్రి కేటీఆర్ సోమవారం ప్రారంభించారు. స్ట్రాటజిక్ రోడ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు(ఎస్ఆర్డీపీ)లో భాగంగా జీహెచ్ఎంసీ ఈ ఫ్లైఓవర్‌ను నిర్మించింది. 780 మీటర్ల పొడవు, 12 మీటర్ల వెడల్పు ఉండే ఈ ఫ్లైఓవర్‌ను రూ.26.45 కోట్లతో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నిర్మించినట్లు మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు.


ఎస్సార్‌డీపీ ప్యాకేజీ-2లో మొత్తం 14 పనులను ప్రారంభించగా.. ఇప్పటికే ఐదు వినియోగంలోకి వచ్చాయి. ఈ ఫ్లైఓవర్‌ ప్రారంభంతో బైరామల్‌గూడ జంక్షన్‌, సాగర్‌ రోడ్‌ జంక్షన్‌ల పరిధిలో ట్రాఫిక్‌ ఒత్తిడి తగ్గనుంది. బైరామల్‌గూడ జంక్షన్‌లో రద్దీ సమయంలో గంటకు 12 వేల వాహనాలు ప్రయాణిస్తుంటాయి. 2034 నాటికి ఈ జంక్షన్ మీదుగా గంటకు 18,653 వాహనాలు ప్రయాణిస్తాయని అంచనా. ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి రావడం వల్ల సికింద్రాబాద్‌ నుంచి ఒవైసీ జంక్షన్‌కు, శ్రీశైలం వైపు వెళ్లే వాహనదారులకు ట్రాఫిక్ ఇక్కట్లు తగ్గుతాయి.

స్ట్రాటజిక్ రోడ్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం (ఎస్ఆర్డీపీ) లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం నగరంలోని కీలక జంక్షన్లలో ఫ్లైఓవర్లు, అండర్ పాసులు, స్కైవాక్స్‌ను నిర్మిస్తోంది. బైరామల్‌గూడ జంక్షన్‌లో రూ.125.53 కోట్ల వ్యయంతో ఐదు ఎస్ఆర్డీపీ ప్రాజెక్టులను నిర్మిస్తున్నారు.





Untitled Document
Advertisements