ఆదిలాబాద్ జిల్లాలో బయటపడ్డ అరుదైన వ్యాధి

     Written by : smtv Desk | Wed, Aug 12, 2020, 05:36 PM

ఆదిలాబాద్ జిల్లాలో బయటపడ్డ అరుదైన వ్యాధి

ఆదిలాబాద్‌ జిల్లాలో అరుదైన వ్యాధి బయటపడింది. పచ్చకామెర్ల తరహాలో ఉండే ‘లెప్టోస్పిరోసిస్’ వ్యాధిని ఇటీవల జిల్లాలో గుర్తించారు. మహానగరాల్లోని మురికివాడల్లో ఎక్కువగా కనిపించే ఈ వ్యాధి ఆదిలాబాద్ జిల్లాలో బయటపడటం గమనార్హం. జిల్లాలో లెప్టోస్‌పిర కేసు నమోదు కావడం ఇదే తొలిసారి కాదు. గత ఏడాది నాలుగు కేసులను ఆదిలాబాద్ జిల్లాలో గుర్తించారు. ఊరటనిచ్చే అంశం ఏంటంటే ఈ వ్యాధికి ట్రీట్‌మెంట్ పెద్ద కష్టమేం కాదు. కాకపోతే సకాలంలో దాన్ని గుర్తించడం చాలా ముఖ్యం.

ఈ వ్యాధి బారిన పడిన వారి కళ్లు పచ్చగా మారతాయి. దీంతో పచ్చకామెర్లు వచ్చాయని చాలా మంది పొరబడుతుంటారు. పచ్చకామర్లకు చికిత్స తీసుకోవడంతో.. వ్యాధి తగ్గకపోగా కాలేయం, కిడ్నీలపై తీవ్ర ప్రభావం పడుతుంది. లివర్ డ్యామేజీని సకాలంలో గుర్తించకపోతే ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది.

ఎలుకలు, కుక్కలు, పందులు, పిల్లులు తదితర జంతువుల మూత్రం ద్వారా ఈ వ్యాధి వ్యాపిస్తుందని వైద్య నిపుణులు తెలిపారు. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో నీరు ఎక్కడిక్కడ నిలిచిపోయి ఉంటుంది. ఈ నీటిలో జంతువుల మూత్రం కలిసినప్పుడు.. ఆ నీటిని తాకిన వారికి ఈ వ్యాధి సోకే ప్రమాదం ఉంది. జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పి, చలి, వాంతులు కావడం అనేవి ఈ వ్యాధి లక్షణాలు. డాక్టర్ల సలహా మేరకు యాంటీ బయోటిక్స్ వాడటం ద్వారా ఈ వ్యాధిని నయం చేయొచ్చు.





Untitled Document
Advertisements