కొత్త కొత్త లక్షణాలతో పంజా విసురుతున్న కరోనా వైరస్

     Written by : smtv Desk | Wed, Aug 12, 2020, 05:45 PM

కొత్త కొత్త లక్షణాలతో పంజా విసురుతున్న కరోనా వైరస్

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారికి చెక్ పెట్టడానికి ఓ వైపు ముమ్మరంగా ప్రయోగాలు జరుగుతుంటే.. మరోవైపు ఈ వైరస్ కొత్త కొత్త లక్షణాలతో పంజా విసురుతోంది. దగ్గు, జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, గొంతు తడారిపోవడం, తలనొప్పి, కండరాల నొప్పి లాంటివి కరోనా లక్షణాలుగా తొలుత పేర్కొన్నారు. ఆ తర్వాత కళ్లు ఎర్రబారడం కూడా ఒక లక్షణమని చెప్పారు. ఆ తర్వాత కొన్ని రోజులకు రుచి, వాసన శక్తిని కోల్పోవడ కూడా కొవిడ్ లక్షణాలుగా పేర్కొన్నారు. తాజాగా ఈ జాబితాలో మరో అంశం చేరింది. ఆపకుండా

ఎక్కిళ్లు రావడం కూడా కరోనా లక్షణం అయుండొచ్చని పరిశోధకులు చెబుతున్నారు.

అమెరికా శాస్త్రవేత్తలు ఈ అంశంపై ప్రయోగాలు చేస్తున్నారు. అమెరికన్ జర్నల్ ఆఫ్ ఎమర్జెన్సీ మెడిసిన్‌లో ఇందుకు సంబంధించిన వివరాలను ప్రచురించారు. అందులో పేర్కొన్న వివరాల ప్రకారం.. చికాగోకు చెందిన 62 ఏళ్ల ఓ వ్యక్తికి ఆపకుండా ఎక్కిళ్లు వచ్చాయి. నాలుగు రోజులుగా ఎక్కిళ్లు వస్తుండటంతో ఆయన చికిత్స కోసం హాస్పిటల్‌కు వచ్చారు.

బాధితుడికి పరీక్షలు జరుపగా.. ఆయనలో ఎక్కిళ్లు తప్ప ఎలాంటి ఇతర లక్షణాలు కనిపించలేదు. అయితే.. కొంత కాలంగా ఆయన షుగర్, బీపీకి మాత్రలు మాత్రం వాడుతున్నారు. అంతే తప్ప.. ఆయనకు జ్వరంగానీ, దగ్గు గానీ ఇతర ఏ లక్షణాలు లేవు. పలు పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఎక్కిళ్లు తగ్గడానికి ఆయనకు కొన్ని మందులు సూచించారు. అయితే.. అవేవీ పనిచేయలేదు.

48 గంటలు గడిచినా ఎక్కిళ్లు ఆగకపోయేసరికి వైద్యులు కరోనా పరీక్షలు జరిపించారు. ఈలోగా ఆయనకు జ్వరం మొదలైంది. అటు ఫలితాల్లో పాజిటివ్‌గా తేలింది. దీంతో వైద్యులు ఆశ్చర్యానికి గురయ్యారు. బాధితుడిలో ఇతర సమస్యలేవీ లేకపోవడం వల్ల ఆయనకు ఆపకుండా ఎక్కిళ్లు రావడానికి కొవిడ్-19 కారణమని వైద్య నిపుణులు చెబుతున్నారు.

బాధుతుడిని వెంటనే ఎమర్జెన్సీ వార్డులో చేర్చించి చికిత్స అందించినట్లు చికాగోలో అతడికి వైద్యం అందించిన హాస్పత్రి కుక్ కంట్రీ హెల్త్ తెలిపింది. ఆయనకు అజిత్రోమైసిన్, హైడ్రాక్సీక్లోరోక్విన్ ఇచ్చినట్లు తెలిపింది. మూడు రోజుల తర్వాత అతడు కోలుకొని డిశ్చార్జ్ అయినట్లు వెల్లడించింది.

బాధితుడికి అంతకుముందు ఎలాంటి సమస్యలు లేకున్నా.. నివేదికలో ఊపిరితిత్తులు చెడిపోయి ఉండటం చూసి వైద్యులు షాక్ తిన్నట్లు మెడికల్ జర్నల్ కథనంలో రాశారు. ఆయనకు ఊపిరితిత్తుల్లో చాలా వాపు వచ్చిందని తెలిపారు. బాధితుడికి ఊపిరితిత్తుల వ్యాధి లేనప్పటికీ ఒక ఊపిరితిత్తి నుంచి వాపు కనిపించి రక్తస్రావం జరిగిందని వెల్లడించారు. ఆ వాపే ఆ ఎక్కిళ్లకు కారణమని తేల్చారు.

వరుసగా 4 రోజుల పాటు ఎక్కిళ్లు ఆగిపోకపోతే కరోనాగా అనుమానించి వైద్యుడిని సంప్రదించాలని అమెరికన్ నిపుణులు సూచిస్తున్నారు. అయితే.. ఈ అంశంపై ఇంకా పరిశోధనలు కొనసాగుతున్నాయి.
ఎక్కిళ్లను ఆపడానికి అలా చేస్తే..
ఇక ఎక్కిళ్లను ఆపడానికి సొంత చిట్కాలను ఉపయోగించి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాధారణంగా ఎక్కిళ్లు అదే పనిగా వస్తే.. నీళ్లు ఎక్కువ తాగుతారు. అయినా ఫలితం లేకపోతే.. తేనె కలిపిన నీళ్లు, లేదా పంచదార నీళ్లు తాగుతారు. అయినప్పటికీ ఎక్కిళ్లు తగ్గకకపోతే శ్వాసను కాసేపు ఆపడం ద్వారా రిలీఫ్ పొందడానికి ప్రయత్నిస్తారు.

అయితే.. ఈ ఇంటి చిట్కాలతో ఎక్కిళ్లు తాత్కాలికంగా తగ్గితే మంచిదేనని.. అలా కాకుండా గంటల తరబడి ఎక్కిళ్లు అలాగే వస్తుంటే డాక్టర్‌ను సంప్రదించాల్సిందేని నిపుణులు చెబుతున్నారు. శ్వాసను ఆపడం ద్వారా ఎక్కిళ్ల నుంచి తాత్కాలికంగా ఉపశమనం పొందినా.. ఇది ఊపిరితిత్తుల పనితీరుపై ప్రభావం చూపుతుందని హెచ్చరిస్తున్నారు. అదే జరిగితే మరింత ప్రమాదం అన్నమాట.. సో బీ కేర్‌ఫుల్.. ఇకపై ఎక్కిళ్లు వచ్చినా నిర్లక్ష్యం చేయొద్దు.





Untitled Document
Advertisements