ఏపీలో దళిత యువకుడికి పోలీసులు శిరోముండనం...రాష్ట్రపతి సీరియస్

     Written by : smtv Desk | Wed, Aug 12, 2020, 05:49 PM

ఏపీలో దళిత యువకుడికి పోలీసులు శిరోముండనం...రాష్ట్రపతి సీరియస్

ఆంధ్రప్రదేశ్‌లో దళిత యువకుడికి పోలీసులు శిరోముండనం చేసిన కేసుపై భారత రాష్ట్రపతి కార్యాలయం స్పందించింది. ఈ ఘటనపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సీరియస్ అయ్యారు. బాధితుడికి అండగా నిలబడేందుకు రామ్‌నాథ్ కోవింద్ ఓ ప్రత్యేక అధికారిని నియమించినట్లు రాష్ట్రపతి కార్యాలయం వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సాధారణ పరిపాలన విభాగానికి ఈ కేసుకు సంబంధించిన దస్త్రం బదిలీ అయింది. అసిస్టెంట్‌ సెక్రటరీ జనార్ధన్‌బాబును కలవాలని, కేసు విషయంలో ఆయనకు సహకరించాలని బాధితుడు ప్రసాద్‌కు రాష్ట్రపతి కార్యాలయం సూచించింది. దీంతో త్వరలో పూర్తి ఆధారాలతో బాధితుడు జనార్ధన్‌బాబును కలవనున్నారు.

కాగా, తూర్పు గోదావరి జిల్లా సీతానగరంలో స్థానిక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడి అనుచరుడి ఫిర్యాదు మేరకు ఇటీవలే వెదుళపల్లిలో ప్రసాద్‌ అనే ఎస్సీ యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. తనను తీవ్రంగా కొట్టడంతో పాటు పోలీస్‌ స్టేషన్‌లోనే శిరోముండనం చేశారని బాధిత యువకుడు వాపోయారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

అయితే ఈ దారుణానికి పాల్పడిన ఎస్సైను సస్పెండ్ చేస్తున్నట్లు పోలీసు శాఖ ప్రకటించింది. కానీ, ఈ ఘటనకు కారణమైన వైసీపీ నాయకులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని బాధితుడు వాపోయారు. అలాగే స్థానికంగా వైసీపీ నాయకులు తనను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారని భావోద్వేగం చెందారు. రాష్ట్రంలో ఇక తనకు న్యాయం జరగదని భావించి నక్సలైట్లలో కలిసిపోయి, తనను తీవ్రంగా అవమానించిన వారిపై ప్రతికారం తీర్చుకోవాలని భావిస్తున్నట్లు బాధిత యువకుడు ఇటీవలే సంచలన వీడియో విడుదల చేశారు. తాను నక్సలైట్లలో కలిసి పోయేందుకు అనుమతివ్వాలని రాష్ట్రపతిని కోరారు. ఈ మేరకు రాష్ట్రపతి కార్యాలయానికి బాధిత యువకుడు ఓ లేఖ కూడా రాశారు. దీంతో ప్రసాద్‌ లేఖపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ స్పందించారు. ఆ యువకుడికి అండగా నిలబడేందుకు ప్రత్యేక అధికారిని నియమిస్తున్నట్లు వెల్లడించారు.






Untitled Document
Advertisements