JEE పరీక్ష రాసే అభ్యర్థులకు టైమ్‌ స్లాట్లు?!

     Written by : smtv Desk | Fri, Aug 14, 2020, 12:52 PM

JEE పరీక్ష రాసే అభ్యర్థులకు టైమ్‌ స్లాట్లు?!

కరోనా కారణంగా ప్రతి విభాగం తన పనితీరును మార్చుకోక తప్పని పరిస్థితి. ఇందుకు విద్యా రంగం మినహాయింపేమీ కాదు. ఇక లక్షలాది విద్యార్థులు హాజరయ్యే ప్రవేశ పరీక్షల విషయంలో తగు జాగ్రత్తలు తప్పనిసరి. ఈ క్రమంలో జేఈఈ మెయిన్ 2020‌ పరీక్ష కేంద్రాలకు వెళ్లేందుకూ టైమ్‌ స్లాట్లు కేటాయించేలా జాతీయ పరీక్షల మండలి (ఎన్‌టీఏ) సమాయత్తమవుతోంది.

కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈ చర్య చేపట్టనున్నారు. సెప్టెంబరు 1 నుంచి 6వ తేదీ వరకు దేశవ్యాప్తంగా మెయిన్‌ పరీక్ష జరగనుంది. ఎవరు ఏ సమయానికి పరీక్ష కేంద్రానికి రావాలో ముందుగానే అధికారులు తెలియజేయనున్నారు. త్వరలో విడుదల కానున్న అడ్మిట్‌ కార్డుల్లో ఆ సమయాన్ని పేర్కొంటున్నారు.

ప‌రిక్ష హాలు లోపలికి పంపే ముందు విద్యారులకు శానిటైజర్‌ వేయడం, థర్మల్‌ స్క్రీనింగ్, ఐడీ కార్డు, హాల్‌టికెట్‌ తనిఖీ తదితర ప్రక్రియలు పూర్తి చేయాల్సి ఉండటంతో విడతల వారీగా విద్యార్థుల‌ను పరీక్ష కేంద్రాలకు రప్పిస్తే కరోనా మార్గదర్శకాలను పాటించేందుకు వీలవుతుందని భావిస్తున్నారు.

ఒక్కో కేంద్రంలో కనీసం 200 మంది ఆన్‌లైన్‌ పరీక్షలు రాస్తారు. దేశవ్యాప్తంగా దాదాపు 11 లక్షల మంది పరీక్షలకు హాజరుకానుండగా.. తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 1.50 లక్షల మంది దరఖాస్తు చేశారు. పరీక్ష కేంద్రాల వద్ద పాటించాల్సిన నిబంధనలపై త్వరలో ఎన్‌టీఏ మార్గదర్శకాలను జారీ చేయనుంది. అయితే విద్యార్థులు ఎప్పటికప్పుడు సంబంధిత వెబ్‌సైట్ https://jeemain.nta.nic.in/ ‌లో తాజా సమాచారం తెలుసుకుంటూ ఉండటం మంచిది.





Untitled Document
Advertisements