తెలంగాణ పోలీసు శాఖలో భారీ సంఖ్యలో కోవిడ్ బాధితులు!

     Written by : smtv Desk | Fri, Aug 14, 2020, 04:18 PM

తెలంగాణ పోలీసు శాఖలో భారీ సంఖ్యలో కోవిడ్ బాధితులు!

లాక్‌డౌన్ సమయంలో కరోనా కట్టడి కోసం తీవ్రంగా శ్రమించిన పోలీసులు భారీ ఎత్తున కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటి వరకు తెలంగాణలో 4259 మంది పోలీసు సిబ్బంది కోవిడ్ బారిన పడ్డారు. ఒక్క హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోనే 1946 మందికి కరోనా సోకింది. రాష్ట్రంలో ఇప్పటి వరకూ 39 మంది పోలీసు సిబ్బంది కరోనా కారణంగా చనిపోగా.. వీరిలో హైదరాబాద్‌లో పని చేసే వారే 26 మంది ఉన్నారు.

కేసుల విచారణ, నిత్యం స్టేషన్‌కు వచ్చే వారితో మాట్లాడాల్సి రావడం, నిందితులను పట్టుకోవడం లాంటి కారణాలతో పోలీసులు ఎక్కువగా కరోనా బారిన పడుతున్నారు. ఇటీవల ములుగు, భద్రాద్రి కొత్తగూడెం తదితర జిల్లాల్లో మావోయిస్టుల కదలికలు పెరిగాయి. వీరిని కట్టడి చేయడం కోసం పోలీసులు స్పెషల్ పార్టీలను రంగంలోకి దింపుతున్నారు. వీరిలో కొందరికి కరోనా ఉండటం.. ఆ విషయం తెలియక జిల్లాల్లోని పోలీసులతో వీరు కలిసి పోవడంతో ఎక్కువ మంది పోలీసులు కోవిడ్ బారిన పడుతున్నారు. ఇటీవల కొత్తగూడెంలో ఇలాగే భారీ సంఖ్యలో పోలీసు సిబ్బందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది.

ఫ్రంట్ వారియర్స్ భారీ సంఖ్యలో కరోనా బారిన పడుతుండటంతో పోలీసు శాఖ ఉన్నతాధికారులు ఒకింత ఆందోళన చెందుతున్నారు. కాకపోతే పోలీసు సిబ్బంది వేగంగా కోలుకుంటుండటం ఊరటనిస్తోంది. కరోనా నుంచి కోలుకున్న సిబ్బందిని ఘనంగా విధుల్లోకి ఆహ్వానిస్తూ వాళ్లలో ఆత్మస్థైర్యం నింపుతున్నారు.





Untitled Document
Advertisements