ఫ్లిప్‌కార్ట్‌లో రూ.99కే హాట్‌స్టార్ ప్రీమియం!?

     Written by : smtv Desk | Sun, Sep 20, 2020, 03:55 PM

ఫ్లిప్‌కార్ట్‌లో రూ.99కే హాట్‌స్టార్ ప్రీమియం!?

సాధారణంగా ఏ వస్తువైనా దాని ధర కంటే చాలా తక్కువ ధరకు లభిస్తుందంటే.. అది తమకు అవసరం ఉన్నా లేకపోయినా కొనడానికి ప్రజలు ఉత్సాహం చూపిస్తారు. ఫ్లిప్ కార్ట్ విషయంలో కూడా అదే జరిగింది. రూ.1,499 విలువైన డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సబ్ స్క్రిప్షన్ రూ.99కేనంటూ ఫ్లిప్ కార్ట్‌లో కనిపించడంతో ప్రజలందరూ దాన్ని ఎగబడి కొన్నారు. అయితే వారందరి ఉత్సాహంపై ఫ్లిప్ కార్ట్ నీళ్లు చల్లించింది. ధరను నిర్ణయించడంలో తమ వైపు నుంచి తప్పు జరిగిందని క్షమాపణలు కోరింది.

దీని గురించి ఒక ప్రకటనను కూడా ఫ్లిప్ కార్ట్ విడుదల చేసింది. సాంకేతికపరమైన లోపం కారణంగా రూ.1,499 విలువైన డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సబ్ స్క్రిప్షన్ రూ.99కే తమ వెబ్ సైట్లో లిస్ట్ అయినట్లు తెలిపింది. దీన్ని కొనుగోలు చేసిన వారందరికీ ఆయా మొత్తాన్ని రీఫండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇటువంటి లోపం తలెత్తినిందుకు వినియోగదారులందరికీ క్షమాపణలు చెప్పింది.

దీనిపై డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కూడా స్పందించింది. ఇది తమ అధికారిక లిస్టింగ్ కాదని, ఇటువంటి అనధికారిక లిస్టింగుల్లో ఉన్న వాటిని ఎవ్వరూ కొనుగోలు చేయవద్దని కోరింది. దాన్ని తొలగించాల్సిందిగా ఫ్లిప్ కార్ట్‌ను కోరామని తెలిపింది. ప్రస్తుతం ఆ పేజీని ఫ్లిప్ కార్ట్ తమ పేజీ నుంచి తొలగించింది.

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వీఐపీ మెంబర్ షిప్ ధర సంవత్సరానికి రూ.399గానూ, ప్రీమియం మెంబర్ షిప్ ధర సంవత్సరానికి రూ.1,499గానూ ఉంది. ప్రజలు ఈ లిస్టింగ్‌ను కొనుగోలు చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే ఫ్లిప్‌కార్ట్‌లోని అతి పెద్ద అమ్మకం సంస్థల్లో ఒకటైన రిటైల్‌నెట్‌లోనే వీటి అమ్మకాలు జరగడం.

ఒకవేళ మీరు కూడా దీన్ని కొనుగోలు చేసి నిరాశ చెందితే.. ఎయిర్ టెల్, జియోలు తాము అందించే కొన్ని ప్లాన్ల ద్వారా డిస్నీప్లస్ హాట్ స్టార్ సబ్ స్క్రిప్షన్‌ను అందిస్తున్నాయి. ఆయా ప్లాన్లను కొనుగోలు చేసి ఈ సబ్ స్క్రిప్షన్‌ను ఉచితంగా పొందవచ్చు.





Untitled Document
Advertisements