వర్షం ఎప్పుడు ఎక్కడ కురుస్తోందో తెలిపే కొత్త యాప్

     Written by : smtv Desk | Tue, Sep 22, 2020, 01:04 PM

వర్షం ఎప్పుడు ఎక్కడ  కురుస్తోందో తెలిపే కొత్త యాప్

ఒకప్పుడు టీవీలు లేని కాలంలో ఏ వార్త అయినా సరే రేడియోలో తెలుసుకోవాల్సింది. గ్రామాల ప్రజల సైతం వార్తల కోసం రేడియో ముందు కూర్చునేవారు. రైతుల కూడా వర్షాలకు సంబంధించిన సమాచారాన్ని రేడియోల ద్వారానే తెలుసుకోవచ్చు. అప్పట్లో రేడియో వార్తల్లో ఆకాశావాణి అంటూ వాతావరణానికి సంబంధించిన సమాచారాన్ని కూడా ప్రజలకు అందించేవారు. ఆ తర్వాత టీవీలు, ఇంటర్నెట్‌, సెల్ ఫోన్ అంటూ ప్రపంచం మొత్తం ప్రజల గుప్పట్లోకి వచ్చేసింది. తాజాగా భారత వాతావరణ శాఖ రూపొందించిన దామిని, మౌసమ్‌ యాప్‌ల ద్వారా వర్షాల రాకను తెలుసుకోవచ్చని అధికారులు చెబుతున్నారు.

ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్‌లో గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి దామిని యాప్‌ని డౌన్‌లోడ్‌ చేసుకుంటే మనం ఉన్న ఏరియాను అందులో టైప్‌ చేస్తే 5 నుంచి 15 నిమిషాల్లో సమీప ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో అక్కడ వర్షం వచ్చే అవకాశం ఉందా, లేదా అనేది చూపిస్తోంది. మౌసమ్‌ యాప్‌లో వర్షాలు పడే రోజులు, వాతావరణ సమాచారాన్ని ఎప్పటికప్పుడు చూసుకోవచ్చునని అధికారులు తెలిపారు. దీంతో ఇప్పుడు స్మార్ట ఫోన్ యూజర్లంతా దామిని, మౌసమ్ యాప్‌లను డౌన్ లోడ్ చేసే పనిలో పడ్డారు.

మరోవైపు తెలంగాణ, పరిసర ప్రాంతాల్లో కొద్ది రోజులుగా ఉపరితల ఆవర్తనం 3.1 కిలోమీటర్ల ఎత్తువరకు కొనసాగుతోంది. ఇందులో 2 కిలోమీటర్ల ఎత్తువరకు అల్పపీడనాలు గ్రేటర్‌ హైదరాబాద్‌ చుట్టే వ్యాపించి ఉన్నాయి. దీంతో గత 5 రోజులుగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయని హైదరాబాద్‌ వాతావరణశాఖ అధికారులు తెలిపారు. అయితే గత ఐదేళ్లుగా నగరంలో ప్రతీ ఏటా గరిష్ట స్థాయిలో వర్షపాతం నమోదు అవుతోంది. నగరంలో ఏటా సెప్టెంబర్‌లో వర్షాలు సాధారణం నుంచి గరిష్ఠ స్థాయిలో నమోదవుతున్నాయి. ఇందులో భాగంగా ఈనెల 16న నగర వ్యాప్తంగా రెండున్నర గంటలపాటు కురిసిన వర్షంతో 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.


ఐదేళ్ల నుంచి కూడా ఆగస్టు, సెప్టెంబర్‌ మాసాల్లో నగరంలో వర్షాలు అధికంగా కురుస్తున్నట్లు వాతావరణశాఖ రికార్డులు చెబుతున్నాయి.





Untitled Document
Advertisements