బైక్ ప్రియులకు బ్యా్డ్ న్యూస్...దేశం నుంచి బైక్ కంపెనీ ఔట్

     Written by : smtv Desk | Thu, Sep 24, 2020, 06:05 PM

బైక్ ప్రియులకు బ్యా్డ్ న్యూస్...దేశం నుంచి బైక్ కంపెనీ ఔట్

బైక్ ప్రియులకు బ్యా్డ్ న్యూస్. ఎందుకంటారా? అమెరికాకు చెందిన దిగ్గజ టూవీలర్ కంపెనీ హార్లీ డేవిడ్‌సన్ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌లో కంపెనీ కార్యకలాపాలను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. అమ్మకాలు, తయారీ సర్వీసులు బంద్ చేస్తున్నట్లు పేర్కొంది.

కంపెనీ రెండు నెలల కిందట వ్యూహాలను మార్చుకుంటున్నట్లు తెలిపింది. అధిక లాభదాయకత కలిగిన మోటార్‌సైకిల్స్‌కు అధిక ప్రాధాన్యం ఇస్తామని, అలాగే అమెరికా మార్కెట్‌‌పైనే పూర్తిగా దృష్టి సారిస్తామని ప్రకటించింది. ఈ క్రమంలోనే ఇప్పుడు కంపెనీ భారత కార్యకలాపాలకు గుడ్ బై చెప్పేయడం గమనార్హం.

2020లో కంపెనీ రిస్ట్రక్చరింగ్ కాస్ట్ దాదాపు 169 మిలియన్ డాలర్లుగా ఉండొచ్చని హార్లీ డేవిడ్‌సన్ పేర్కొంటోంది. దేశంలో 70 మంది ఉద్యోగుల తొగింపు కూడా ఇందులో భాగంగానే చెప్పుకొచ్చింది. కంపెనీ అంతర్జాతీయ విక్రయాల్లో భారత్‌ నుంచి వాటా 5 శాతం దిగువునే ఉందని కంపెనీ తెలిపింది. అందుకే కార్యకలాపాలకు స్వస్తి చెబుతున్నట్లు ప్రకటించింది.

ఇకపోతే హార్లీ డేవిడ్‌సన్ భారత్ నుంచి వెనక్కి వెళ్లిపోవడం లేదంటే భారత్‌లో కార్యకలాపాలను మూసివేయడం కేంద్ర ప్రభుత్వంపై కూడా ప్రతికూల ప్రభావం చూపొచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా చాలా సందర్భాల్లో భారత్ హార్లీ డేవిడ్‌సన్ బైక్స్ దిగుమతులపై అధిక సుంకం విధిస్తోందని పేర్కొంటూ వచ్చారు.





Untitled Document
Advertisements