పంజాబ్‌పై కోహ్లి చేసిన తప్పిదాలు !

     Written by : smtv Desk | Fri, Sep 25, 2020, 11:46 AM

పంజాబ్‌పై కోహ్లి చేసిన తప్పిదాలు !

ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో అనూహ్యంగా ఓడిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్.. రెండో మ్యాచ్‌లో సత్తా చాటింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై 97 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో 132 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన రాహుల్ ఐపీఎల్ 2020లో తొలి శతకం బాదాడు. ఐపీఎల్ చరిత్రలో హయ్యస్ట్ రన్ స్కోర్ చేసిన భారత క్రికెటర్‌గానూ కింగ్స్ ఎలెవన్ కెప్టెన్ నిలిచాడు.

ఈ మ్యాచ్‌లో రాహుల్ బ్యాటింగ్ ముందు ఆర్సీబీ బౌలింగ్ తేలిపోయింది. ఫీల్డింగ్ తప్పిదాలు కూడా ఆ జట్టుకు శాపంగా పరిణమించాయి. మొదటి మూడు ఓవర్లలో టాప్-3 బ్యాట్స్‌మెన్ పెవిలియన్ చేరడంతో బెంగళూరు పీకల్లోతు కష్టాల్లో పడిపోయింది. ఏ దశలోనూ 207 పరుగుల లక్ష్యాన్ని చేధించేలా బెంగళూరు కనిపించలేదు.

సన్‌రైజర్స్‌పై విజయం తర్వాత ఆర్సీబీ ఆత్మవిశ్వాసంతో కనిపించింది. కానీ మూడో మ్యాచ్‌లో అనేక తప్పిదాలతో మ్యాచ్‌ను చేజార్చుకుంది. పంజాబ్‌పై కోహ్లి సేన చేసిన తప్పిదాలేంటో చూద్దాం..

ఈ మ్యాచ్‌లో కోహ్లి రెండుసార్లు రాహుల్ ఇచ్చిన క్యాచ్‌లను వదిలేశాడు. డెత్ ఓవర్లలో రాహుల్ భారీ షాట్లకు ప్రయత్నించగా.. బంతి కోహ్లి చేతుల్లోకి వెళ్లినప్పటికీ.. రెండు క్యాచ్‌లను వదిలేయడం ఆశ్చర్యం కలిగించింది. దీంతో రాహుల్ శతకం బాదాడు. రాహుల్ క్యాచ్‌లను కోహ్లి పట్టేస్తే.. పంజాబ్ 180లోపే పరుగులు చేసేది. దీంతో ఛేజింగ్ పెద్ద కష్టమయ్యేది కాదు.
సన్‌రైజర్స్‌పై సత్తా చాటిన ఆర్సీబీ బౌలర్లను ఈ మ్యాచ్‌లో కెప్టెన్ కోహ్లి మెరుగ్గా వాడుకోలేపోయాడు. క్రీజ్‌లో సెటిల్ అయిన బ్యాట్స్‌మెన్ ఉన్నప్పుడు.. మిడిల్ ఓవర్లలోనే బెస్ట్ బౌలర్లతో బౌలింగ్ చేయించి ఒత్తిడి పెంచాలన్న కోహ్లి వ్యూహం ఫలించలేదు. చాహల్, సైనీ బౌలింగ్‌లో జాగ్రత్తగా ఆడిన రాహుల్ ఆఖర్లో చెలరేగిపోయాడు. లాస్ట్ ఐదు ఓవర్లలో సైనీ ఒక్క ఓవర్ మాత్రమే బౌలింగ్ చేశాడు. చాహల్, సుందర్, సైనీ, దూబేలను కోహ్లి సరిగా వాడుకోలేకపోవడంతో.. చివరి ఐదు ఓవర్లలో పంజాబ్ 80 రన్స్ చేసింది.

207 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన బెంగళూరు విజయం సాధించకున్నా.. రాజస్థాన్‌పై చెన్నై ఆడినట్లయిన లక్ష్యానికి చేరువ అవుతుందని భావించారు. కానీ కోహ్లి, డివిలియర్స్, ఫించ్ లాంటి హిట్టర్లు ఉన్న ఆర్సీబీ బ్యాటింగ్ లైనప్ ఆదిలోనే అనవసరమైన దూకుడు చూపింది. 4 పరుగులకే పడిక్కల్, ఫిలిప్, కోహ్లి వికెట్లను చేజార్చుకుంది. ఈ దశలో ఫించ్, డివిలియర్స్ పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేసినా.. ఒత్తిడి కారణంగా ఔటయ్యారు.

భారీ లక్ష్యంతో బరిలో దిగిన ఆర్సీబీ.. 2 పరుగులకే దేవదత్ పడిక్కల్ వికెట్ కోల్పోయింది. ఈ సమయంలో కోహ్లి బ్యాటింగ్‌కు వస్తాడని భావించగా.. అనూహ్యంగా జోష్ ఫిలిప్‌ బ్యాటింగ్‌కు వచ్చాడు. ఈ ఆసీస్ ఆటగాడు బౌలర్లపై ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయాడు. 3 బంతులు ఎదుర్కొని డకౌటయ్యాడు. సన్‌రైజర్స్‌పై రెండు బంతులను మాత్రమే ఎదుర్కొన్న ఫిలిప్.. ఆత్మవిశ్వాసంతో కనిపించలేదు. ఫిలిప్ వికెట్ కీపింగ్‌లోనూ గొప్ప ప్రదర్శన చేయలేకపోయాడు.





Untitled Document
Advertisements