నా వివరాలు ఎవ్వరికీ ఇవ్వొద్దు: శశికళ

     Written by : smtv Desk | Fri, Sep 25, 2020, 01:57 PM

నా వివరాలు ఎవ్వరికీ ఇవ్వొద్దు: శశికళ

దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అక్రమాస్తుల కేసులో జైలు శిక్ష అనుభవిస్తోన్న ఆమె స్నేహితురాలు వీకే శశికళ ముందుగానే విడుదలవుతారంటూ ప్రచారం జరిగింది. అయితే, ఇది నిజం కాదని, జైలు నుంచి ఆమె ముందస్తుగా విడుదల కావడంలేదని సమాచార హక్కు చట్టం ద్వారా వెలుగులోకి వచ్చింది. అయితే, తనకు సంబంధించిన సమాచారాన్ని ఇతరులకు ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన శశికళ కర్ణాటక జైళ్లశాఖకు లేఖ రాశారు.

తనకు సంబంధించిన వివరాలను ఎవరికీ ఇవ్వొద్దని అందులో ఆమె కోరారు. తన విడుదల సమాచారాన్ని సేకరించిన వారితో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తాను జైలు నుంచి విడుదలవ్వకుండా అడ్డుకోడానికి కొత్త వివరాల కోసం సమాచార చట్టాన్ని అడ్డం పెట్టుకునే అవకాశం ఉందని ఆ లేఖలో పేర్కొన్నట్టు శశికళ వర్గం పేర్కొంది.

వచ్చే ఏడాది ఫిబ్రవరిలో శశికళ విడుదలవుతున్నట్టు ఆర్టీఐ ద్వారా వెల్లడయ్యింది. శశికళ విడుదలపై ఓ వ్యక్తి ఆర్టీఐని ఆశ్రయించగా ఈ మేరకు జైళ్ల శాఖ స్పష్టతనిచ్చింది. ఈ కేసులో శశికళకు సుప్రీంకోర్టు రూ.10 కోట్ల జరిమానా విధించిన విషయం తెలిసిందే. జరిమానాను ఆమె చెల్లించలేకపోతే అదనంగా మరో ఏడాది జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది.

శశికళ విడుదలపై కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆమె ఈ లేఖ రాయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇందులో భాగంగానే అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం నేత దినకరన్ బెంగళూరులో తిష్ట వేసినట్టు తెలుస్తోంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది రోజుల ముందే శశికళ విడుదలయ్యే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా, తమ ఆస్తులను కబ్జా చేశారంటూ తంజావూరుకు చెందిన మనోహరన్ భార్య వలర్మతి ఫిర్యాదు మేరకు శశికళ కుటుంబసభ్యులు, బంధువులపై పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణకు గైర్హాజరు కావడంతో కోర్టు పీటీ వారెంట్ జారీ చేసింది.





Untitled Document
Advertisements