జాన్సన్ సింగిల్ డోస్ టీకా ట్రయల్స్‌లో సానుకూల ఫలితాలు

     Written by : smtv Desk | Sat, Sep 26, 2020, 03:19 PM

జాన్సన్ సింగిల్ డోస్ టీకా ట్రయల్స్‌లో సానుకూల ఫలితాలు

తాము అభివృద్ధి చేసిన ప్రయోగాత్మక కరోనా వైరస్ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్‌లో సానుకూల ఫలితాలు వెల్లడయినట్టు జాన్సన్ అండ్ జాన్సన్‌ సంస్థ ప్రకటించింది. శుక్రవారం మధ్యంతర ఫలితాలను ప్రచురించిన జాన్సన్ అండ్ జాన్సన్.. ఒక్క డోసుతో కరోనా మహమ్మారిని అంతం చేసే సామర్థ్యంతో దీనిని అభివృద్ధి చేసింది. ఏడీ26.కోవి2.ఎస్ పేరుతో రూపొందించిన ఈ వ్యాక్సిన్.. రెండు వేర్వేరు డోసులలో సమాన ఫలితాలను చూపిందని పేర్కొంది. మోడెర్నా, ఫైజర్ టీకాలకు విరుద్ధంగా ఒక్క డోసుతోనే వైరస్‌ను కట్టడిచేయడం వల్ల టీకా పంపిణీని సులభతరమవుతుంది.

అయితే, వయసు మళ్లినవారికే కరోనా వైరస్ ముప్పు ఎక్కువగా ఉండటంతో వారిపై ఈ వ్యాక్సిన్ ఎలా పనిచేస్తుందనే విషయంపై స్పష్టతలేదు. క్లినికల్ ట్రయల్స్‌లో 1,000 యువ వాలంటీర్లు పాల్గొన్నారు. జులై నుంచి ప్రారంభమైన జాన్సన్ అండ్ జాన్సన్ క్లినికల్ ట్రయల్స్‌లో భాగంగా తొలుత కోతులపై ప్రయోగించారు. ఒక్క డోసుతోనే కోతుల్లో రోగనిరోధకత చూపింది.

ప్రస్తుతం సానుకూల ఫలితాలు రావడంతో మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌ను రెట్టించిన ఉత్సాహంతో ప్రారంభించింది. మొత్తం 60వేల మంది వాలంటీర్లపై ప్రయోగానికి అనుమతులు లభించాయి. మూడో ఫేజ్ ట్రయల్స్ ఫలితాలు ఈ ఏడాది చివరి లేదా వచ్చే ఏడాది తొలినాళ్లలో వెల్లడవుతాయని జాన్సన్ అండ్ జాన్సన్ అంచనా వేస్తోంది.

రెండో దశ క్లినికల్ ట్రయల్స్‌లో టీకా తీసుకున్న 98 శాతం మందిలో 29 రోజుల తర్వాత వ్యాధికారక కణాలను నుంచి రక్షించే ప్రతిరోధకాలను ఉత్పత్తిచేసినట్టు మధ్యంతర విశ్లేషణలు తెలిపాయి. అయితే, కేవలం 15 మందికి సంబంధించిన ఫలితాలు మాత్రమే వెల్లడయ్యాయి. 65 ఏళ్లు దాటిన వారిలో అలసట, కండరాల నొప్పులు వంటి దుష్ప్రభవాలు రేటు 36 శాతం ఉంది.. ఇది యువ వాలంటీర్లలో కనిపించే 64 శాతం కన్నా చాలా తక్కువ. వృద్ధులలో రోగనిరోధక ప్రతిస్పందన అంత బలంగా ఉండకపోవచ్చని సూచిస్తుంది.

అధ్యయనం పూర్తయినప్పుడు భద్రత, సమర్ధతపై మరిన్ని వివరాలు అందుబాటులోకి వస్తాయని పరిశోధకులు తెలిపారు. ప్రస్తుతానికి, తీవ్రమైన దుష్ప్రభావంపై పెద్ద సంఖ్యలో ఎక్కువ అధ్యయనాలు ఎందుకు అవసరమో ఫలితాలు సూచిస్తాయని టీకా విశ్లేషణ‌లో పాల్గొన్న హార్వర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ బారీ బ్లూమ్ వ్యాఖ్యానించారు. మొత్తమ్మీద టీకా మూడో దశ ట్రయల్స్‌లో సానుకూల ఫలితాలు వెల్లడవుతాయని ఆశిస్తున్నామని బ్లూమ్ చెప్పారు.





Untitled Document
Advertisements