కేంద్ర మాజీ మంత్రి జశ్వంత్ సింగ్ అనారోగ్యంతో కన్నుమూత

     Written by : smtv Desk | Sun, Sep 27, 2020, 12:46 PM

కేంద్ర మాజీ మంత్రి జశ్వంత్ సింగ్ అనారోగ్యంతో కన్నుమూత

కేంద్ర మాజీ మంత్రి జశ్వంత్ సింగ్ కన్నుమూశారు. చాలా రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం ఉదయం తుది శ్వాస విడిచారు. జశ్వంత్ సింగ్ మృతికి ప్రధాని నరేంద్ర మోదీ దగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతి తనకు ఎనలేని విచారాన్ని కలిగించిందని.. సైనికుడిగా, రాజకీయ నేతగా ఆయన దేశానికి సేవలు అందించారని కొనియాడారు.. ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమైనవి అన్నారు. జశ్వంత్ సింగ్ తీసుకున్న నిర్ణయాలు భవిష్యత్తుకు బాటలు వేశాయని అన్నారు.. వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు. జశ్వంత్ సింగ్ మృతికి రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ సంతాపం ప్రకటించారు. ఆయన వివిధ హోదాల్లో దేశానికి సేవలుచేశారని, రక్షణ శాఖ మంత్రిగా కూడా పనిచేశారని ఆయన గుర్తు చేశారు.. ఇతర బీజేపీ నేతలు కూడా సంతాపాన్ని తెలియజేశారు.

జశ్వంత్ సింగ్ 1938 జనవరి 3న జన్మించారు. ఇండియన్ ఆర్మీలో పనిచేశారు.. బీజేపీ వ్యవస్థాపక సభ్యుల్లో ఆయన ఒకరు. రాజస్థాన్‌కు చెందిన జస్వంత్‌, పశ్చిమ బెంగాల్‌ లోని డార్జిలింగ్‌ నుంచి కూడా ఎన్నికయ్యారు. ఆర్థిక, రక్షణ, విదేశీ వ్యవహారాల్లాంటి కీలక శాఖలన్నింటినీ నిర్వహించిన అతి కొద్దిమందిలో ఆయన ఒకరు. కేంద్రంలో బీజేపీ 13 రోజుల పాలనలో ఆయన ఆర్థికశాఖ మంత్రి పదవి చేపట్టారు. వాజ్‌పేయి ప్రధానిగా ఉండిన రెండు సందర్భాల్లోనూ ఆయన కీలక శాఖలు చేపట్టారు. ఆర్థిక మంత్రిగా ఉన్న కాలంలో ఆయన తీసుకున్న నిర్ణయాల్లో ప్రధానమైంది యూనిట్‌ ట్రస్ట్ ఆఫ్‌ ఇండియా పునర్‌నిర్మాణం. 1998లో భారత అణుపరీక్ష అనంతరం, అమెరికాతో దెబ్బ తిన్న సంబంధాలను పూర్వస్థితికి తీసుకువచ్చేందుకు ఆయన ఎంతో కృషి చేశారు. 1999 డిసెంబరులో భారతీయ విమానం హైజాక్‌కు గురైనప్పుడు హైజాకర్లతో పాటు జశ్వంత్‌ కూడా కాందహార్‌ వెళ్లారు.

జశ్వంత్ 2014లో బీజేపీపై తిరుగుబాటు బావుటా ఎగరవేశారు.. దీంతో అధిష్టానం ఆయనపై వేటు వేసింది. తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ టిక్కెట్‌ నిరాకరించడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి బీజేపీ అభ్యర్థి చేతిలో ఆయన ఓడారు. అలాగే 2018 రాజస్థాన్‌ ఎన్నికల సందర్భంగా జశ్వంత్‌సింగ్‌ కుమారుడు మన్వేంద్ర సింగ్‌ కూడా బీజేపీకి రాజీనామా చేశారు.





Untitled Document
Advertisements