అతడ్ని వీలైనంత త్వరగా పెవిలియన్ బాట పట్టిస్తాం: నాథన్ లయన్ హెచ్చరికలు

     Written by : smtv Desk | Mon, Jan 04, 2021, 05:16 PM

అతడ్ని వీలైనంత త్వరగా పెవిలియన్ బాట పట్టిస్తాం: నాథన్ లయన్ హెచ్చరికలు

సిడ్నీ వేదికగా గురువారం నుంచి ప్రారంభంకానున్న మూడో టెస్టులో రోహిత్ శర్మ కోసం టీమిండియా మేనేజ్‌మెంట్ ఎవరిపై వేటు వేయబోతుంది..? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లయన్ వెల్లడించాడు. సిడ్నీలో 14 రోజులు క్వారంటైన్‌ని పూర్తి చేసుకుని ఇటీవల భారత జట్టుతో రోహిత్ శర్మ చేరగా.. అతడ్ని వైస్ కెప్టెన్‌‌‌గా టీమిండియా మేనేజ్‌మెంట్ నియమించింది. దాంతో.. సిడ్నీ టెస్టులో అతను ఆడటం ఖాయమవగా.. అతని కోసం ఓపెనర్ మయాంక్ అగర్వాల్ లేదా మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ హనుమ విహారి తమ స్థానాన్ని త్యాగం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

‘‘క్రికెట్ ప్రపంచంలో ఉన్న అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌లలో రోహిత్ శర్మ కూడా ఒకడు. అతను టీమ్‌లో ఉంటే ప్రత్యర్థి బౌలర్లకి సవాల్ తప్పదు. టీమిండియా బ్యాటింగ్ లైనప్‌పైనా అతని ప్రభావం ఉంటుంది. కానీ.. సిడ్నీ టెస్టులో అతని కోసం ఎవరిపై వేటు వేయబోతున్నారు..? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే.. రోహిత్ శర్మని ఔట్ చేసేందుకు కూడా మా వద్ద ప్రణాళికలు ఉన్నాయి. వీలైనంత త్వరగా అతడ్ని పెవిలియన్ బాట పట్టిస్తాం’’ అని నాథన్ లయన్ హెచ్చరికలు జారీ చేశాడు.

ఆస్ట్రేలియాతో ఇటీవల ముగిసిన రెండు టెస్టుల్లోనూ ఓపెనర్ మయాంక్ అగర్వాల్ అంచనాల్ని అందుకోలేకపోయాడు. దాంతో.. అతనిపై వేటు వేయాలని కొంత మంది మాజీ క్రికెటర్లు సూచనలు చేస్తున్నారు. అలానే మిడిలార్డర్‌లో హనుమ విహారి‌ని తప్పించి.. ఓపెనర్ శుభమన్ గిల్‌ని నెం.5లో ఆడించాలని సునీల్ గవాస్కర్ సూచిస్తున్నాడు. అప్పుడు రోహిత్ శర్మతో పాటు మయాంక్ అగర్వాల్ భారత ఇన్నింగ్స్‌ని ఓపెనర్లుగా ఆరంభించనున్నారు.





Untitled Document
Advertisements