శ్మశానంలో 25 మంది మృతి

     Written by : smtv Desk | Mon, Jan 04, 2021, 05:17 PM

శ్మశానంలో 25 మంది మృతి

ఉత్తర్ ప్రదేశ్‌లో ఓ వ్యక్తి అంత్యక్రియల సందర్భంగా చోటు చేసుకున్న విషాద ఘటనలో మృతుల సంఖ్య 25కు పెరిగింది. బంధువు అంత్యక్రియల్లో పాల్గొనడానికి వచ్చి, వారు కూడా కానరాని లోకాలకు వెళ్లిపోయారు. యూపీలోని ఘజియాబాద్‌ జిల్లాలోని ఉఖ్‌లార్సీ గ్రామంలో ఆదివారం (జనవరి 3) ఈ ఘటన జరిగింది.


గ్రామంలో ఆదివారం ఉదయం మరణించిన ఓ వ్యక్తి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించడానికి శ్మశానానికి తీసుకెళ్లారు. అదే సమయంలో వర్షం మొదలైంది. దీంతో అంత్యక్రియల కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన బంధువులు, గ్రామస్థులు శ్మశానంలో ఓ నిర్మాణం కింద తలదాచుకున్నారు. కాసేపటికే అది ఒక్కసారిగా కుప్పకూలింది.

ఘటన జరిగిన సమయంలో ఆ నిర్మాణం కింద 50 మందికి పైగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు 25 మంది మృతదేహాలను వెలికితీశారు. సహాయ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.

ప్రమాదం జరిగిన వెంటనే గ్రామస్థులు సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎన్డీఆర్‌ఎఫ్‌, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. క్రేన్ల సాయంతో శిథిలాలను తొలగించారు. శిథిలాల కింద నుంచి కొంత మందిని బయటకు తీసుకొచ్చి సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు.

ఈ ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. ఘటనపై దర్యాప్తు చేపట్టాలని అధికారులను ఆయన ఆదేశించారు. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని మోదీ ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.





Untitled Document
Advertisements