రష్యా నుంచి ఆయుధాలు కొంటే చర్యలు తప్పవు... అమెరికా వార్నింగ్!

     Written by : smtv Desk | Tue, Jan 05, 2021, 04:16 PM

రష్యా నుంచి ఆయుధాలు కొంటే చర్యలు తప్పవు... అమెరికా వార్నింగ్!

రష్యాతో రక్షణ ఉత్పత్తుల కొనుగోలు ఒప్పందం భారత్‌కు కొంత ఇబ్బందిగా పరిణమించింది. ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను రష్యా నుంచి కొనుగోలు చేయాలని భారత్ భావిస్తోంది. దీనికి అమెరికా రూపంలో ఆటంకాలు ఎదురవుతున్నాయి. అత్యాధునిక క్షిపణి వ్యవస్థ కొనుగోలుకు సంబంధించి రష్యా, భారత్ మధ్య గతంలోనే ఒప్పందం కుదిరింది. అయితే, రష్యా నుంచి ప్రధాన రక్షణ ఉత్పత్తులను కొనుగోలు చేస్తే సీఏఏటీఎస్ కింద ఆంక్షలు విధిస్తామని భాగస్వామ్య దేశాలకు అమెరికా ఇటీవల హెచ్చరికలు పంపింది.

తాజాగా, రష్యా నుంచి భారత్ ఆయుధాలను కొనుగోలు చేస్తే, ఆంక్షలు విధిస్తామని హెచ్చరించింది. భారత్ తన రక్షణ విధానాన్ని మార్చుకోవాలని, సంస్కరణలు తీసుకు రావాలని యూఎస్ కాంగ్రెస్ ఆధ్వర్యంలోని సీఆర్ఎస్ (కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్) తాజా నివేదికలో సూచించింది. ఆధునిక సాంకేతికతను అందుకోవాలన్న ప్రయత్నాలు తగదని, రక్షణ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిధిని మరింత విస్తృతం చేసి, రక్షణ విధానాన్ని మార్చుకోవాలని పేర్కొంది.

రష్యా అభివృద్ధి చేసిన ఎస్-400 గగనతల రక్షణ వ్యవస్థకు మేము వ్యతిరేకం... వీటిని భారత్ కొనుగోలు చేస్తే, ఆంక్షలు విధించే అవకాశం ఉంది.. అమెరికా ఆంక్షల చట్టానికి భారత్- రష్యా ఒప్పందం వ్యతిరేకంగా ఉండటమే ఇందుకు కారణం’ అని సీఆర్ఎస్ పేర్కొంది.

ఇదిలా ఉండగా.. సీఆర్ఎస్ నివేదిక అధికారికం కాకపోయినా, అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన స్వతంత్ర సభ్యులు దీనిని రూపొందిస్తారు. ఈ నివేదిక ఆధారంగా పలు కీలక నిర్ణయాలను తీసుకుంటారు. ఇదే సమయంలో ఆంక్షలు విధించే దేశంతో ఉన్న ద్వైపాక్షిక సంబంధాలు ఆధారంగానే తుది నిర్ణయాలు ఉంటాయి.

వాస్తవానికి ఈ క్షిపణి వ్యవస్థ కొనుగోలుకు సంబంధించి 2018లో ఐదు బిలియన్ డాలర్ల విలువైన ఒప్పందం భారత్, రష్యా మధ్య కుదిరింది. ఇందుకు అడ్వాన్స్ కింద 800 మిలియన్ డాలర్లు చెల్లించింది. ఆ సమయంలో ట్రంప్ ప్రభుత్వం ఎన్ని హెచ్చరికలు చేసినా, భారత్ వెనక్కు తగ్గలేదు. పొరుగు దేశాల నుంచి తమకు ఉన్న ముప్పు నేపథ్యంలో వీటి కొనుగోలు తప్పనిసరని స్పష్టం చేసింది.

ర‌క్ష‌ణ వ్య‌వ‌స్థ‌కు సంబంధించిన ఎస్‌-400ని కొనుగోలు చేసే హ‌క్కు భార‌త్‌కు ఉంద‌ని ఉద్ఘాటించింది. ఎవ‌రి ద‌గ్గ‌ర ఎటువంటి మిలిట‌రీ ఆయుధాలు కొనుగోలు చేస్తున్నామ‌న్న విష‌యంలో స్పష్టతతో ఉన్నామ‌ని, అది మా సార్వ‌భౌమాధికారమని తేల్చిచెప్పింది. ఆయుధాల‌ను కొనుగోలు చేసే స్వేచ్ఛ త‌మ‌కు ఉందని, దీనిపై తమకు ఏ దేశం అభ్యంతరం చెప్పడాన్ని ఇష్టపడమని కుండబద్దలుకొట్టింది.

ఈ విషయంలో రష్యా సైతం భారత్‌కు మద్దతుగా నిలుస్తుంటే, అమెరికా మాత్రం ఒప్పందంపై కొంత కఠినంగానే ఉంది. దీనికి బలమైన కారణం ఉంది. ఎందుకంటే ఎస్-400 గగనతల రక్షణ వ్యవస్థ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైంది. అమెరికాకు చెందిన ఇదే తరహా మిసైల్స్ థాడ్, పేట్రియాట్‌లతో పోలిస్తే ఎస్-400 సామర్ధ్యం ఎక్కువ. ఈ రెండు రకాల వ్యవస్థలను భారత్‌కు విక్రయించాలని అమెరికా గతంలో ప్రయత్నించగా, కేంద్రం మాత్రం రష్యా వైపు మొగ్గు చూపింది.

శత్రువుల యుద్ధ విమానాలతో పాటు డ్రోన్‌లు, క్షిపణులను కూల్చివేయగల సత్తా దీని సొంతం. గగనతలంలో విమానాలు 30 కిలోమీటర్ల ఎత్తులో ఉన్నా, 400 కిలోమీటర్ల దూరంలోనే గుర్తించి కూల్చివేయగలదు. ఒకే సమయంలో 30 వరకూ విమానాలు, యూఏవీలు, క్షిపణులను ఎదుర్కొనే సామర్ధ్యంతో దీనిని రూపొందించారు. అంతే కాదు... వీటిని ఎక్కడికైనా చాలా సులభంగా తరలించి, ఐదు నిమిషాల్లోనే శత్రువులపై ఎదురుదాడికి సిద్ధం చేయవచ్చు. విమానాలు, నౌకలు, ఉపరితలం నుంచి కూడా ఈ వ్యవస్థను వినియోగించవచ్చు.





Untitled Document
Advertisements