IND vs AUS 3rd Test: భారత జట్టు ప్రకటన

     Written by : smtv Desk | Wed, Jan 06, 2021, 01:46 PM

IND vs AUS 3rd Test: భారత జట్టు ప్రకటన

ఆస్ట్రేలియాతో సిడ్నీ వేదికగా గురువారం నుంచి ప్రారంభంకానున్న మూడో టెస్టు కోసం తుది జట్టుని భారత్ బుధవారం ప్రకటించింది. రెండు మార్పులతో కూడిన ఈ జట్టులోకి ఓపెనర్ రోహిత్ శర్మ రీఎంట్రీ ఇవ్వగా.. ఫాస్ట్ బౌలర్ నవదీప్ సైనీకి ఛాన్స్ లభించింది. ఐపీఎల్ 2020 సీజన్‌లో ఆకట్టుకున్న నవదీప్ సైనీ.. తొలిసారి భారత్ తరఫున టెస్టుల్లో ఆడబోతున్నాడు. ఓపెనర్ మయాంక్ అగర్వాల్‌పై వేటు పడగా.. ఫాస్ట్ బౌలర్ ఉమేశ్ యాదవ్ గాయంతో సిరీస్ నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే. దాంతో వారి స్థానాల్లో రోహిత్ శర్మ, నవదీప్ సైనీ జట్టులోకి వచ్చారు.

సిడ్నీ టెస్టుకి భారత్ తుది జట్టు: అజింక్య రహానె (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), శుభమన్ గిల్, చతేశ్వర్ పుజారా, హనుమ విహారి, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, నవదీప్ సైనీ

అడిలైడ్ వేదికగా జరిగిన తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ 17, 9 పరుగులు మాత్రమే చేసిన మయాంక్ అగర్వాల్.. ఆ తర్వాత మెల్‌బోర్న్ టెస్టులోనూ 0, 5 పరుగులతో నిరాశపరిచాడు. దాంతో.. అతనిపై వేటు వేసిన టీమిండియా మేనేజ్‌మెంట్ రోహిత్ శర్మకి ఓపెనర్‌గా ఛాన్స్ ఇచ్చింది. నాలుగు టెస్టుల ఈ సిరీస్‌లో తొలి రెండు టెస్టులకీ దూరమైన రోహిత్ శర్మ.. తాజా పర్యటనలో మొదటి మ్యాచ్‌ని ఆస్ట్రేలియా గడ్డపై ఆడబోతున్నాడు.

అడిలైడ్ టెస్టులో 8 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా గెలుపొందగా.. మెల్‌బోర్న్ టెస్టులో టీమిండియా అదే తరహాలో 8 వికెట్ల తేడాతో గెలుపొంది సిరీస్‌ని 1-1తో సమం చేసింది. దాంతో.. సిడ్నీ టెస్టులో గెలిచిన జట్టుకి ఆధిక్యం దక్కనుండటంతో మ్యాచ్ ఆసక్తికరంగా జరగనుంది.





Untitled Document
Advertisements