గణతంత్ర వేడుకలు..భారత్ పర్యటనను రద్దుచేసుకున్న బ్రిటన్ ప్రధాని బోరిస్

     Written by : smtv Desk | Wed, Jan 06, 2021, 02:11 PM

గణతంత్ర వేడుకలు..భారత్ పర్యటనను రద్దుచేసుకున్న బ్రిటన్ ప్రధాని బోరిస్

ఈ ఏడాది గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరుకావాల్సిన బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ తన భారత్ పర్యటనను రద్దుచేసుకున్నారు. యూకేలో కొత్తరకం కరోనా స్ట్రెయిన్ విజృంభణ కొనసాగుతోన్న విషయం తెలిసిందే. దీంతో బోరిస్ జాన్సన్ తన భారత పర్యటనను విరమించుకున్నారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీకి మంగళవారం ఫోన్‌చేసిన జాన్సన్ విచారం వ్యక్తం చేశారు.

కొత్త ‘స్ట్రెయిన్‌’ వ్యాప్తితో బ్రిటన్‌లో ఏర్పడిన ప్రజారోగ్య సంక్షోభ పరిస్థితుల దృష్ట్యా జనవరి 26 నాటి గణతంత్ర వేడుకలకు హాజరుకాలేకపోతున్నట్టు తెలిపారు. బ్రిటన్‌లో మరోసారి లాక్‌డౌన్‌ విధిస్తూ టెలివిజన్‌లో ప్రజలనుద్దేశించి ప్రసంగించిన మర్నాడే బోరిస్‌ జాన్సన్‌ భారత పర్యటనపై నిర్ణయం తీసుకున్నారు.

మోదీకి ఫోన్ చేసిన ఆయన.. ఈ ఏడాది తొలినాళ్లలో బ్రిటన్‌ వేదికగా జరిగే జీ 7 దేశాల సమ్మేళనానికి ముందే భారత్‌‌ను సందర్శిస్తానని జాన్సన్‌ హామీ ఇచ్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రధాని దేశంలో ఉండి, స్థానిక పరిస్థితులపై దృష్టిపెట్టడం చాలా అవసరమని, అందుకే జాన్సన్ ఈ నిర్ణయం తీసుకొన్నట్టు బ్రిటన్ ప్రధాని కార్యాలయం డౌనింగ్‌ స్ట్రీట్‌ అధికార ప్రతినిధి తెలిపారు.

ప్రధానులు ఇరువురూ కరోనా నేపథ్యంలో తమ తమ బాధ్యతలను గుర్తించి, రెండు దేశాల సంబంధాలు మరింత బలోపేతం చేసే దిశగా మాట్లాడుకున్నారని వివరించారు. యూకే ఆసుపత్రుల్లో కరోనా బాధితుల సంఖ్య వారం రోజుల్లో భారీగా పెరిగింది. డిసెంబరు 29న రికార్డు స్థాయిలో 80 వేలకిపైగా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. మరణాల సంఖ్య కూడా గత వారం కంటే 20 శాతం పెరిగింది.

మంగళవారం అర్ధరాత్రి నుంచి కఠినమైన లాక్‌డౌన్ అమల్లోకి వచ్చింది. బుధవారం నుంచి విద్యాలయాలు, దుకాణాలు, క్రీడా ప్రాంతాలు, మైదానాలు అన్నీ మూసేస్తారు. అన్నిరకాల పరీక్షలు రద్దు చేశారు. ఆసుపత్రులు, నిత్యావసరాలు, ఔషధాల దుకాణాలు, పోస్టాఫీసుల్లాంటి అత్యవసర సర్వీసులు మాత్రమే తెరవడానికి అనుమతించారు. ప్రార్ధనా స్థలాలు, చర్చిలను కూడా మూసే ఉంచుతారు. స్నేహితులు, బంధువులను మూకుమ్మడిగా కలవడానికి వీల్లేదు. ఒకరినొకరు తమ తమ ఇంటిలోనే కలుసుకోవాలి.. అదీ ఒక్కొక్కరు మాత్రమే.





Untitled Document
Advertisements