ప్రణాళిక విఫలమైంది తప్పు మాదే: కిమ్

     Written by : smtv Desk | Wed, Jan 06, 2021, 03:17 PM

ప్రణాళిక విఫలమైంది తప్పు మాదే: కిమ్

భిన్నమైన వ్యవహార శైలితో తరుచూ వార్తల్లో ఉండే ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ ఉన్నట్టుండి రూటు మార్చారు. నూతన సంవత్సరం సందర్భంగా దేశ ప్రజలకు లేఖ రాసి ఆశ్చర్యంలో ముంచెత్తిన కిమ్.. ఆ షాక్ నుంచి తేరుకోక ముందే సంచలన ప్రకటన చేశారు. తమ దేశ ఆర్థికాభివృద్ధి ప్రణాళిక విఫలమైందని ఇటీవల జరిగిన అధికార వర్కర్స్‌ పార్టీ సమావేశంలో కిమ్‌ స్వయంగా ఒప్పుకోవడం విశేషం. ఉత్తర కొరియా చరిత్రలో ఇటువంటి సమీక్షా సమావేశాలు కేవలం ఎనిమిది సార్లు మాత్రమే నిర్వహించగా.. ఈ ఐదేళ్లలో ఇదే మొదటిది. కిమ్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో గత ఐదేళ్లలో ప్రభుత్వ పనితీరుపై సమీక్ష నిర్వహించారు. దాదాపు అన్ని రంగాల్లో నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవడంలో విఫలమైనట్టు అధ్యక్షుడు ఈ సందర్భంగా అంగీకరించినట్టు సమాచారం. తాము చేసిన తప్పిదాలు, అనుభవాలు, పాఠాలు వంటి అంశాలను గురించి లోతుగా విశ్లేషించాలని కిమ్‌ సూచించారు. అయితే ఏ విషయంలో తప్పిదాలు జరిగాయే కచ్చితంగా వెల్లడించలేదు.

అధ్యక్ష పీఠం నుంచి ట్రంప్ మరో పది రోజుల్లో దిగిపోనుండగా.. కిమ్ వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఏర్పడింది. ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత అమెరికా, ఉత్తర కొరియాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకున్న విషయం తెలిసిందే. ఇరువురు నేతలూ కారియా మిరియాలు నూరుకున్నారు. ఒకానొక దశలో అణ్వాయుధ దాడికి కూడా సిద్ధమయ్యాయి. అమెరికా- ఉత్తర కొరియా మధ్య ఉద్రిక్తతలు ప్రపంచ దేశాలను కలవరానికి గురిచేశాయి. అమెరికా ఆంక్షలు విధించడంతో ఉత్తర కొరియా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంది. ట్రంప్‌తో కయ్యానికి కాలు దువ్విన కిమ్.. తర్వాత మెత్తబడ్డారు.

దశాబ్దాల వైరాన్ని పక్కనబెట్టి అమెరికా, ఉత్తర కొరియా అధ్యక్షులు 2018 జూన్‌లో సింగపూర్‌ వేదికగా సమావేశమయ్యారు. ఆ తర్వాత ఇరు దేశాధినేతలు పలు సందర్భాల్లో భేటీ అయ్యారు. అయితే, ఆంక్షల సడలింపుకు సంబంధించిన చర్చలు నిలిచిపోవడంతో.. అమెరికా-ఉత్తర కొరియా సంబంధాల్లో ప్రతిష్టంభన నెలకొంది.

కరోనా వైరస్ విషయంలో కిమ్ జోంగ్ వ్యవహారశైలిపై విమర్శలు వెల్లువెత్తాయి. సరిహద్దుల్ని పూర్తిగా మూసివేయాలన్న కిమ్‌ నిర్ణయంతో ఆ దేశం ఏకాకిగా మిగిలిపోయింది. దీంతో ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెరిగింది. పక్కనే ఉన్న చైనాతో అంతగా సఖ్యతలేదు. పలు దేశాలు ఇప్పటికే తమ రాయబార కార్యాలయాలను మూసివేయడం, క్రమంగా తమ ప్రతినిధులను తగ్గించాయి.





Untitled Document
Advertisements