ట్రంప్ ఖాతాలను నిలిపివేసిన ఫేస్‌బుక్

     Written by : smtv Desk | Fri, Jan 08, 2021, 03:53 PM

ట్రంప్ ఖాతాలను నిలిపివేసిన ఫేస్‌బుక్

తాను ఎన్నికల్లో ఓడిపోతే అధికార బదిలీ అంత ప్రశాంతంగా జరగకపోవచ్చంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ గతంలోనే వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అధికార మార్పిడి విషయంలో జరుగుతున్న పరిణామాలు అలాగే ఉన్నాయి. డెమొక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్ గెలుపును నిర్ధారించడానికి అమెరికా కాంగ్రెస్ బుధవారం సమావేశం కాగా.. ట్రంప్ మద్దతుదారులు ఆ భవనంలోకి చొచ్చుకొచ్చారు. పెద్ద ఎత్తున ఆందోళనకారులు ఒక్కసారిగా దూసుకురావడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు.

ఈక్రమంలో పోలీసులు, ఆందోళనకారులకు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘర్షణలో జరిగిన కాల్పుల్లో ఓ మహిళ చనిపోయింది. ఈ నేపథ్యంలో అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా సైన్యాన్ని రంగంలోకి దింపారు. మరోవైపు, సామాజిక మాధ్యమాల్లో పోస్టులపై ఫేస్‌బుక్, ట్విట్టర్ సంచలన నిర్ణయం తీసుకున్నాయి.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఖాతాను 12 గంటలు స్తంభింపజేస్తున్నట్టు ట్విట్టర్ ప్రకటించింది. డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ ఖాతాను 12 గంటలు లాక్ చేస్తామని పేర్కొన్న ట్విట్టర్.. భవిష్యత్తులో విధానాలను ఉల్లంఘిస్తే ఆయన అకౌంట్ శాశ్వతంగా నిలిపివేస్తామని హెచ్చరించింది. నియమాలకు విరుద్ధంగా ఉన్న పోస్ట్‌లను తొలగించాలని సూచించింది.

అలాగే, ఫేస్‌బుక్ సైతం ట్రంప్ అకౌంట్‌ను 24 గంటలపాటు స్తంభింపజేసినట్టు బ్లూబర్గ్ నివేదిక పేర్కొంది. నిబంధనలు ఉల్లంఘించడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. కాగా, వాషింగ్టన్ డీసీ ఘర్షణకు బాధ్యతవహిస్తూ ట్రంప్ యంత్రాంగంలోని కీలక అధికారి, వైట్‌హౌస్ మాజీ ప్రెస్ సెక్రెటరీ స్టెఫానియా గ్రాసిమ్ రాజీనామా చేశారు. ఈ ఘటనను ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగా పలువురు అభివర్ణించారు.

మాజీ అధ్యక్షుడు బారక్ ఒబామా స్పందిస్తూ.. అమెరికా కాంగ్రెస్‌‌పై జరిగిన దాడి గొప్ప సిగ్గుచేటు.. కానీ, ఇది ముందే ఊహించిందని వ్యాఖ్యానించారు. రాజధాని వాషింగ్టన్ డీసీ అల్లర్లు అమెరికాపై జరిగిన అసాధారణమైన దాడిగా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ అభివర్ణించారు. ఈ ఘటనపై ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ మాట్లాడుతూ.. స్వదేశమైనా, విదేశమైనా ఎన్నికల హింస క్షమించరానిదని అన్నారు. మరోవైపు, పరిస్థితి అదుపులోకి రావడంతో బైడెన్ గెలుపును ధ్రువీకరించే ప్రక్రియ తిరిగి ప్రారంభమయ్యింది.





Untitled Document
Advertisements