నాలుగో టెస్టు ముంగిట 3 రోజుల లాక్‌డౌన్

     Written by : smtv Desk | Sat, Jan 09, 2021, 12:39 PM

నాలుగో టెస్టు ముంగిట 3 రోజుల లాక్‌డౌన్

భారత్, ఆస్ట్రేలియా మధ్య జనవరి 15 నుంచి 19 వరకూ బ్రిస్బేన్ వేదికగా జరగాల్సిన నాలుగో టెస్టుపై సందిగ్ధత నెలకొంది. సిడ్నీతో పాటు బ్రిస్బేన్‌లోనూ ఇటీవల కరోనా వైరస్ వ్యాప్తి మళ్లీ పెరుగుతుండటంతో అక్కడి ప్రభుత్వం కఠినమైన క్వారంటైన్ రూల్స్‌ని అమలు చేస్తోంది. దాంతో.. ప్రస్తుతం సిడ్నీ వేదికగా మూడో టెస్టు మ్యాచ్ ఆడుతున్న భారత్ జట్టు.. అక్కడే నాలుగో టెస్టుని కూడా నిర్వహించాలని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ)ని కోరింది. ఒకవేళ సాధ్యంకాకపోతే కనీసం నిబంధనల్ని సడలించాలని సూచించింది. కానీ.. అందుకు ఒప్పుకోని సీఏ.. ఎట్టి పరిస్థితుల్లో బ్రిస్బేన్‌లోనే నాలుగో టెస్టుని నిర్వహిస్తామని చెప్పుకుంటూ వచ్చింది. కానీ.. తాజాగా క్వీన్స్‌ల్యాండ్ ప్రభుత్వం మూడు రోజుల లాక్‌డౌన్‌ని విధించింది. దాంతో ఇప్పుడు సీఏ ఎటూ తేల్చుకోలేకపోతోంది.

బ్రిస్బేన్‌ టెస్టు కోసం అక్కడికి వెళ్లిన తర్వాత టీమిండియా కనీసం మూడు రోజులు క్వారంటైన్‌లో ఉండాల్సి ఉంది. అంతేకాకుండా ఆటగాళ్లు మైదానం, హోటల్‌‌కే పరిమితం కావాలి.. కలిసి భోజనం చేయకూడదు, జట్టు సమావేశం నిర్వహించకూడదని రూల్స్ చెప్తున్నాయి. దాంతో.. ఈ కఠిన నిబంధనల్ని తాము మళ్లీ పాటించబోమని భారత్ తేల్చి చెప్పేసింది. ఆస్ట్రేలియా గడ్డపై సిరీస్‌ ఆరంభానికి ముందు భారత్ జట్టు 14 రోజులు క్వారంటైన్‌లో ఉన్న విషయం తెలిసిందే.

భారత్ హెచ్చరికలపై చర్చలు జరుపుతున్న క్రికెట్ ఆస్ట్రేలియాని తాజాగా మూడు రోజుల లాక్‌డౌన్ సందిగ్ధంలో పడేసింది. ఇప్పుడు నాలుగో టెస్టుని బ్రిస్బేన్‌లో నిర్వహించాలా..? లేదా ప్రత్యామ్నాయ వేదికగా ఇప్పటికే సిడ్నీని ఎంపిక చేసిన నేపథ్యంలో అక్కడ నిర్వహించాలా..? అని తేల్చుకోలేకపోతోంది. మొత్తానికి బ్రిస్బేన్‌కి వెళ్లేందుకు భారత్‌కి మాత్రం ససేమేరా ఇష్టంలేనట్లు తెలుస్తోంది. సీఏ పట్టు వీడకపోతే మూడు టెస్టులతోనే భారత్ జట్టు టూర్‌ని ముగించేందుకు కూడా వెనుకాడబోదని ఇటీవల బీసీసీఐ అధికారి చెప్పిన విషయం తెలిసిందే.





Untitled Document
Advertisements