దేశంలో పెరుగుతున్న పెట్రోల్, డీజిల్‌ ధరలపై భగ్గుమన్న విపక్షాలు

     Written by : smtv Desk | Mon, Mar 08, 2021, 06:12 PM

దేశంలో పెరుగుతున్న పెట్రోల్, డీజిల్‌ ధరలపై భగ్గుమన్న విపక్షాలు

రెండో దశ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కాగా.. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలపై విపక్షాలు భగ్గుమన్నాయి. ఉదయం రాజ్యసభ ప్రారంభమైన తర్వాత పెరుగుతున్న పెట్రోల్, డీజిల్‌పై చర్చ చేపట్టాలని కాంగ్రెస్ సభ్యులు డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సభను అడ్డుకున్నారు. క్వశ్చన్ అవర్ మొదలైన వెంటనే కాంగ్రెస్ సభ్యులు తమ స్థానాల్లో నిలబడి నినాదాలు చేయడంతో సభలో గందరగోళం నెలకుంది.
దీంతో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సభను వాయిదా వేశారు. ఛైర్మన్ వారించినా విపక్ష సభ్యులు వినిపించుకోకపోవడంతో మధ్యాహ్నం 1.00 గంట వరకూ సభను వాయిదా వేస్తున్నట్టు వెంకయ్య తెలిపారు. దేశంలో పెరుగుతున్న పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలపై ప్రతిపక్ష పార్టీలు నిరసన తెలిపాయి. గత నెల రోజులుగా చమురు ధరలు చుక్కలు చూపిస్తున్నాయి.

క్రమంగా పెరుగుతూ పెట్రోల్ కొన్ని రాష్ట్రాల్లో రూ.100 మార్క్‌ను దాటేసింది. నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు విపక్షాలు ప్రయత్నిస్తున్నాయి.
పెరుగుతున్న చమురు ధరలకు నిరసనగా పలు పార్టీలు వివిధ రూపాల్లో నిరసనలు తెలియజేస్తున్నాయి. సైకిల్‌, ఎండ్ల బండ్లు, ఎలక్ట్రికల్ వాహనాలపై ప్రయాణిస్తూ నేతలు నిరసన వ్యక్తం చేస్తున్నారు.

ఫిబ్రవరి 27 అత్యధికంగా దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.91.17 చేరుకోగా.. అప్పటి నుంచి ధరల్లో ఎటువంటి మార్పు లేదు. సభ్యుల ఆందోళనపై స్పందించిన రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాడు.. ‘నేను మొదటి రోజు ఎటువంటి కఠినమైన చర్య తీసుకోవటానికి ఇష్టపడను’అని వ్యాఖ్యానించారు.

అంతకు ముందు రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే పెట్రోల్ ధరల పెరుగుదల అంశాన్ని లేవనెత్తారు. రూల్ 257 కింద దీనిపై చర్చించడానికి సభ చర్యలను నిలిపివేయాలని ఆయన డిమాండ్ చేశారు. ‘పెట్రోల్ ధర ఈ రోజు లీటరుకు దాదాపు రూ.100 గా ఉంది. డీజిల్ ధర కూడా రూ 90 కు చేరుకుంది. ఎల్పీజీ ధరలు కూడా పెరిగాయి. 2014 నుంచి మొత్తం రూ. 21 లక్షల కోట్లు ఎక్సైజ్ సుంకంగా వసూలు చేశారు. ఈ కారణంగా, దేశంలో ధరలు పెరుగుతుండటం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు’ అని అన్నారు.





Untitled Document
Advertisements