ముంబయి పోరాడిన తీరుకి కోల్‌కతా తల వంచక తప్పలేదు

     Written by : smtv Desk | Wed, Apr 14, 2021, 10:47 AM

ముంబయి పోరాడిన తీరుకి కోల్‌కతా తల వంచక తప్పలేదు

ఐపీఎల్ 2021 సీజన్‌లో డిఫెండింగ్ ఛాంపియన్‌ ముంబయి ఇండియన్స్ బోణి కొట్టింది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో.. అద్భుత పోరాట పటిమని కనబర్చిన ముంబయి ఇండియన్స్ 10 పరుగుల తేడాతో విజయం సాధించింది. కోల్‌కతా విజయానికి చివరి 12 బంతుల్లో 19 పరుగులు అవసరమైన దశలో గొప్పగా బౌలింగ్ చేసిన జస్‌ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్.. కోల్‌కతా హిట్టర్ ఆండ్రీ రసెల్ (9: 15 బంతుల్లో 1x4), మాజీ కెప్టెన్ దినేశ్ కార్తీక్ (8 నాటౌట్: 11 బంతుల్లో)‌లను కట్టడి చేసి కేవలం నాలుగేసి పరుగులు మాత్రమే ఇచ్చారు. దాంతో.. కోల్‌కతాకి 142/7తో ఓటమి తప్పలేదు.

మ్యాచ్‌లో అంతకముందు టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ముంబయి టీమ్.. ఆల్‌రౌండర్ ఆండ్రీ రసెల్ (5/15) దెబ్బకి 152 పరుగులకే ఆలౌటైంది. ముంబయి జట్టులో సూర్యకుమార్ యాదవ్ (56: 36 బంతుల్లో 7x4, 2x6) హాఫ్ సెంచరీ నమోదు చేయగా.. కెప్టెన్ రోహిత్ శర్మ (43: 32 బంతుల్లో 3x4, 1x6) చెప్పుకోదగిన స్కోరు చేశాడు. కోల్‌కతా బౌలర్లతో రసెల్ పాటు పాట్ కమిన్స్ రెండు వికెట్లు పడగొట్టగా.. వరుణ్ చక్రవర్తి, షకీబ్ అల్ హసన్, ప్రసీద్ కృష్ణ తలో వికెట్ తీశారు.

కోల్‌కతాకి లక్ష్యఛేదనలో ఓపెనర్లు నితీశ్ రాణా (57: 47 బంతుల్లో 6x4, 2x6), శుభమన్ గిల్ (33: 24 బంతుల్లో 5x4).. తొలి వికెట్‌కి 8.5 ఓవర్లలోనే 72 పరుగుల భాగస్వామ్యంతో మెరుగైన ఆరంభమిచ్చారు. కానీ.. గిల్ ఔట్ తర్వాత కోల్‌కతాలో తడబాటు మొదలైంది. నెం.3లో వచ్చిన రాహుల్ త్రిపాఠి (5) ఆ తర్వాత ఇయాన్ మోర్గాన్ (9), షకీబ్ అల్ హసన్ (9) ఓవర్ల వ్యవధిలో వరుసగా ఔటైపోయారు. టీమ్ స్కోరు 122 వద్ద రాణా కూడా రాహుల్ చాహర్ బౌలింగ్‌లో వికెట్ చేజార్చుకున్నాడు. ఇక అక్కడి నుంచి అసలు మ్యాచ్ మొదలైంది.

ఆండ్రీ రసెల్, దినేశ్ కార్తీక్ చివరి ఓవర్ వరకూ క్రీజులో ఉన్నప్పటికీ.. వారికి స్వేచ్ఛగా బ్యాట్ ఝళిపించే అవకాశాన్ని ముంబయి బౌలర్లు ఇవ్వలేదు. రసెల్ ఇచ్చిన క్యాచ్‌‌లను కృనాల్ పాండ్యా, జస్‌ప్రీత్ బుమ్రా నేలపాలు చేశారు. అయినప్పటికీ.. ముంబయి టీమ్ ఆశలు వదిలేయకుండా చివరి బంతి వరకూ పోరాడి విజయాన్ని అందుకుంది. ముంబయి బౌలర్లలో రాహుల్ చాహర్ 4 వికెట్లు పడగొట్టగా.. ట్రెంట్ బౌల్ట్ రెండు, కృనాల్ పాండ్యా ఒక వికెట్ పడగొట్టారు.

మ్యాచ్‌లో టాస్ గెలిచిన కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దాంతో.. రోహిత్ శర్మతో కలిసి ముంబయి ఇన్నింగ్స్‌ని ప్రారంభించిన ఓపెనర్ డికాక్ (2: 6 బంతుల్లో) రెండో ఓవర్‌లోనే వరుణ్ చక్రవర్తికి వికెట్ సమర్పించుకున్నాడు. అనంతరం వచ్చిన సూర్యకుమార్ యాదవ్ రెండో వికెట్‌కి 76 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పినా.. హాఫ్ సెంచరీ తర్వాత టీమ్ స్కోరు 86 వద్ద సూర్యకుమార్ ఔటైపోయాడు. ఇక అక్కడి నుంచి ముంబయి కోలుకోలేకపోయింది.

నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చిన ఇషాక్ కిషన్ (1), ఆ తర్వాత వచ్చిన హార్దిక్ పాండ్య (15), కీరన్ పొలార్డ్ (5) భారీ షాట్లు ఆడబోయి వికెట్లు చేజార్చుకున్నారు. ఇక ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్ వేసిన ఆండ్రీ రసెల్ బౌలింగ్‌లో తొలి రెండు బంతులకీ ఫోర్లు బాదిన కృనాల్ పాండ్యా (15).. మూడో బంతికి ఔటవగా.. నాలుగో బంతికి జస్‌ప్రీత్ బుమ్రా (0), ఆఖరి బంతికి రాహుల్ చాహర్ (8) వికెట్లు చేజార్చుకున్నారు. మొత్తంగా మ్యాచ్‌లో కేవలం 2 ఓవర్లు మాత్రమే వేసిన రసెల్ 15 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. అలానే ముంబయి టీమ్‌లో ఏడుగురు ఆటగాళ్లు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు.





Untitled Document
Advertisements