సీఎం మమతా బెనర్జీ ప్రచారంపై నిషేధం...ఈసీ కీలక నిర్ణయం

     Written by : smtv Desk | Wed, Apr 14, 2021, 12:09 PM

సీఎం మమతా బెనర్జీ ప్రచారంపై నిషేధం...ఈసీ కీలక నిర్ణయం

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఎన్నికల సంఘం షాకిచ్చింది. ముస్లింలను ఓట్లను చీల్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని.. ముస్లింలంతా టీఎంసీకి ఓటేసి అండగా నిలవాలంటూ దీదీ ఇచ్చిన పిలుపు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. మమతా బెనర్జీ ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించి మతపరమైన వ్యాఖ్యలు చేశారంటూ బీజేపీ ఈసీకి ఫిర్యాదు చేసింది. ఫిర్యాదుపై స్పందించిన ఎన్నికల సంఘం మమతాకి నోటీసులు జారీ చేసింది. నోటీసులపై వెనక్కి తగ్గబోనని.. ముస్లింల ఓట్లు చీల్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని మమతా వ్యాఖ్యానించారు. హిందూ, ముస్లిం ఓటు బ్యాంకు అంటూ ప్రధాని మోదీ వ్యాఖ్యానించారని.. ఆయనపై ఎన్ని ఫిర్యాదులు నమోదయ్యాయని ఈసీని ప్రశ్నించారు దీదీ.

అయితే మమతా వ్యాఖ్యలను సీరియస్‌గా పరిగణించిన ఈసీ చర్యలకు ఉపక్రమించింది. మమతా ఎన్నికల ప్రచారంపై 24 గంటల నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆమె మరో 24 గంటలపాటు ఎక్కడా ఎన్నికల ప్రచారంలో పాల్గొనకూడదని ఈసీ ఆదేశించింది. సోమవారం రాత్రి 8 గంటల నుంచి మంగళవారం రాత్రి 8 గంటల వరకూ ఆమె ఎన్నికల ప్రచారం పాల్గొనకూడదని ఈసీ స్పష్టం చేసింది. ఆమె ఏరూపంలో ప్రచారం చేయకూడదని తెలిపింది. ఈసీ నిర్ణయంపై టీఎంసీ ఘాటుగా స్పందించింది. ఎన్నికల కమిషన్ పూర్తిగా రాజీపడినట్లు కనిపిస్తోందంటూ ఆ పార్టీ ఎంపీ డెరిక్ వ్యాఖ్యానించారు.





Untitled Document
Advertisements