ఆశలు వదిలేసిన ముంబై... రాణా వికెట్‌తో మ్యాచ్ టర్న్

     Written by : smtv Desk | Wed, Apr 14, 2021, 02:13 PM

ఆశలు వదిలేసిన ముంబై... రాణా వికెట్‌తో మ్యాచ్ టర్న్

ఐపీఎల్ 2021 సీజన్‌లో ముంబయి ఇండియన్స్ గొప్పగా పుంజుకుంది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో.. గెలుపుపై ఆశలు వదిలేసినట్లు కనిపించిన ముంబయి టీమ్.. ఓపెనర్ నితీశ్ రాణా (57: 47 బంతుల్లో 6x4, 2x6) ఔట్ తర్వాత అనూహ్యరీతిలో పుంజుకుని 10 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది.

మ్యాచ్‌లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ముంబయి జట్టు 152 పరుగులకి ఆలౌటవగా.. అనంతరం ఛేదనలో కోల్‌కతాకి శుభమన్ గిల్‌ (33: 24 బంతుల్లో 5x4, 1x6)తో కలిసి నితీశ్ రాణా 8.5 ఓవర్లలోనే 72 పరుగుల భాగస్వామ్యంతో శుభారంభమిచ్చాడు. ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన రాణా మ్యాచ్‌ని వేగంగా ముగించేసేలా కనిపించాడు. కానీ.. స్పిన్నర్ రాహుల్ చాహర్ అతడ్ని బోల్తా కొట్టించి మ్యాచ్‌ని ముంబయి వైపు తిప్పాడు.

స్పిన్నర్ రాహుల్ చాహర్.. అప్పటికే శుభమన్ గిల్ (33), రాహుల్ త్రిపాఠి (5), ఇయాన్ మోర్గాన్‌ (7)లను ఔట్ చేశాడు. కానీ.. నితీశ్ రాణా ఒక ఎండ్‌‌లో దూకుడుగా ఆడేస్తూ బంతులు, పరుగుల మధ్య అంతరం తగ్గించేస్తూ కనిపించాడు. దాంతో.. ఇన్నింగ్స్ 15వ ఓవర్‌లో రాహుల్ చాహర్ చేతికి మరోసారి ముంబయి కెప్టెన్ రోహిత్ శర్మ బంతినిచ్చాడు. అది మ్యాచ్‌లో చాహర్‌కి చివరి ఓవర్. దాంతో.. ఆ ఓవర్ ఓ రెండు బంతుల్ని నితీశ్ రాణాకి విసిరి ఇబ్బంది పెట్టిన చాహర్.. చివరి బంతిని వ్యూహాత్మకంగా విసిరాడు. ఆ బంతితో తన ఓవర్ల కోటా ముగుస్తుండటంతో రాణా కచ్చితంగా పెద్ద షాట్ కోసం ప్రయత్నిస్తాడని చాహర్ ముందే ఊహించాడు.


ఆ ఓవర్ ఆఖరి బంతిని ఆఫ్ స్టంప్‌కి వెలుపలగా ప్లిపర్ రూపంలో రాహుల్ చాహర్ సంధించాడు. దాంతో.. భారీ షాట్ కోసం క్రీజు వెలుపలికి వచ్చిన నితీశ్ రాణా.. బంతి అందకపోవడంతో స్టంపౌట్‌గా వెనుదిరిగాడు. బంతి వెనక్కి వెళ్లిన తర్వాత నితీశ్ రాణా.. స్టంపౌట్ నుంచి తప్పించుకునేందుకు కనీసం క్రీజులోకి కూడా వెళ్లే ప్రయత్నం చేయలేదు. రాణా ఔట్ తర్వాత కోల్‌క‌తా తడబడగా.. ముంబయికి మ్యాచ్‌పై ఆశలు చిగురించి పట్టుదలతో బౌలింగ్ చేసింది. దాంతో.. దినేశ్ కార్తీక్ (8 నాటౌట్: 11 బంతుల్లో), ఆండ్రీ రసెల్ (9: 15 బంతుల్లో 1x4) ఆఖరి ఓవర్ వరకూ క్రీజులో ఉన్నా.. కోల్‌కతాని గెలిపించలేకపోయారు. ఒకవేళ మరో 2-3 ఓవర్లు రాణా క్రీజులో ఉండింటే..? కచ్చితంగా ముంబయి ఇండియన్స్‌కి అతను నష్టం చేసేవాడు.





Untitled Document
Advertisements