సిరిసిల్ల జిల్లాలో కేటీఆర్‌కు షాక్...కాన్వాయ్‌‌ని అడ్డుకున్న ఏబీవీపీ

     Written by : smtv Desk | Mon, Apr 19, 2021, 05:05 PM

సిరిసిల్ల జిల్లాలో కేటీఆర్‌కు షాక్...కాన్వాయ్‌‌ని అడ్డుకున్న ఏబీవీపీ

తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్‌కు రాజన్న సిరిసిల్ల జిల్లాలో నిరసన సెగ తగిలింది. నిరుద్యోగుల సమస్య పరిష్కరించాలని, ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఇల్లంతకుంటలో ఏబీవీపీ, బీజేపీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ఇల్లంతకుంటలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం, రైతు వేదిక, మహిళ కమ్యూనిటీ భవనం, నూతన తహశిల్దార్ కార్యాలయం ప్రారంభోత్సవం పాల్గొనేందుకు మంత్రి కేటీఆర్ సోమవారం అక్కడికి వెళ్లారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీని వెంటనే చేపట్టాలంటూ ఆందోళనకారులు డిమాండ్‌ చేస్తూ మంత్రి కాన్వాయ్‌‌ని అడ్డుకునేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఏబీవీపీ, బీజేపీ కార్యకర్తలకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ కార్యకర్తలు నినాదాలు చేయడంతో అక్కడి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో ఆందోళనకారులు, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తోపులాట చోటు చేసుకుంది. నినాదాలు ప్రతి నినాదాలు, తోపులాటతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు లాఠీచార్జీ చేసి అందరినీ చెదరగొట్టారు. ఈ ఘటనలో పలువురు ఏబీవీపీ కార్యకర్తలు గాయపడ్డారు.‌ ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ చేపట్టకుండా టీఆర్ఎస్ సర్కారు నిరుద్యోగుల జీవితాలతో చెలగాలమాడుతోందని ఆందోళనకారులు విమర్శించారు. గతవారం వరంగల్‌ వెళ్లిన కేటీఆర్‌ను ఏబీవీపీ కార్యకర్తలు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. పోచమ్మ మైదాన్ రత్న హోటల్ సెంటర్ వద్ద రోడ్డుకు అడ్డంగా పడుకుని కాన్వాయ్‌‌ని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. తాజా ఘటనలో కేటీఆర్ పర్యటనలకు బందోబస్తు పెంచాలని పోలీసులు భావిస్తున్నారు.






Untitled Document
Advertisements