న్యూ ఇయర్ వేడుకలపై నిషేధం విధించిన కర్ణాటక ప్రభుత్వం

     Written by : smtv Desk | Thu, Dec 23, 2021, 03:17 PM

న్యూ ఇయర్ వేడుకలపై నిషేధం విధించిన కర్ణాటక ప్రభుత్వం

దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఇప్పటికే దేశంలో 213 వరకూ ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఇందులో ఢిల్లీ, మహారాష్ట్రల్లో ఎక్కువ కేసులున్నాయి. కేరళ, కర్ణాటక, తెలంగాణల్లోనూ ఒమిక్రాన్ కేసులు రిజిస్టర్ అయ్యాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమై సత్వర చర్యలు తీసుకుంటున్నాయి. ఇందులో భాగంగా కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు విధించింది.

ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి కట్టడి చేసేందుకు డిసెంబర్ 30 నుంచి జనవరి 2 వరకూ బహిరంగంగా జరిగే వేడుకలను నిషేధిస్తున్నట్టు కర్ణాటక బసవరాజ్ బొమ్మై ప్రభుత్వం ప్రకటించింది. అయితే భౌతిక దూరం పాటిస్తూ పబ్బులు, రెస్టారెంట్లలోని జరిగే వేడుకల్లో పాల్గొనేందుకు అనుమతిచ్చింది. వ్యాక్సిన్ వేయించుకోని వారికి ఈ అవకాశం లేదు. కేవలం వ్యాక్సిన్ వేయించుకున్నవారు మాత్రమే పబ్బులు, రెస్టారెంట్లలోని సెలబ్రేషన్స్‌కు వెళ్లొచ్చని ప్రభుత్వం వెల్లడించింది. క్లబ్‌లు, పబ్‌ల్లో, అపార్ట్‌మెంట్లలో డీజేలు, ప్రత్యేక ఈవెంట్‌లకు అనుమతి ఇవ్వలేదు. అలాగే బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు గుమికూడటాన్ని కూడా నిషేధిస్తున్నట్టు సీఎం తెలిపారు. అధికారులు, కోవిడ్ నిపుణుల కమిటీ సభ్యులతో సమావేశమైన తర్వాత సీఎం బసవరాజ్ బొమ్మై ఈ నిర్ణయం తీసుకున్నారు.

కర్ణాటకలో ఇప్పటి వరకూ 20కు పైగా ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నట్టే ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతుంది. రాష్ట్రాల్లో కేసుల సంఖ్య పెరగడంతో కలవరం మొదలైంది. దీంతో కర్ణాటక ప్రభుత్వం నూతన సంవత్సర వేడుకలపై ఆంక్షలు విధించింది. దీంతో పాటు మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడంపై ప్రజల్లో అవగాహన పెంచుతుంది.





Untitled Document
Advertisements