రైతు 2 ఎకరాల భూమిలో సోలార్ ప్లాంట్. నెలకు ఎంత సంపాదనో..

     Written by : smtv Desk | Fri, Jun 24, 2022, 07:33 PM

రైతు 2 ఎకరాల భూమిలో సోలార్ ప్లాంట్. నెలకు ఎంత సంపాదనో..

ఎడారి ప్రాంతమే ఎక్కువగా ఉంటుంది. సాగునీరు సంగతి తర్వాత.. త్రాగు నీటికి కూడా ఎన్నో కష్టాలు పడాలి. నీటి ఎద్దడి కారణంగా అక్కడి భూముల్లో వ్యవసాయం చేయడం కష్టం. భూములన్నీ బీళ్లుగా మారిపోయాయి. అలాంటి చోట ఓ డాక్టర్ అద్భుతాలు సృష్టిస్తున్నాడు. స్వతహాగా రైతు అయిన ఆ డాక్టర్.. సిరుల పంట పండిస్తున్నాడు. నిరూపయోగంగా పడి ఉన్న భూమిలో.. సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేసి.. నెలానెలా లక్షలు సంపాదిస్తున్నాడు. మరి ఎంత భూమిలో సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేశాడు.. దానికి ఎంత ఖర్చయింది? ఎంత విద్యుత్ ఉత్పత్తి అవుతుంది? దానిని ఎవరికి విక్రయిస్తున్నాడు? నెలకు ఎంత సంపాదిస్తున్నాడు.. వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
రాజస్థాన్‌లోని కోట్‌పుత్లి పట్టణానికి చెందిన అమిత్ సింగ్ యాదవ్ వృత్తిరీత్యా డాక్టర్. వీరికి వ్యవసాయ భూమి కూడా ఉంది. అందువల్ల వ్యవసాయంపైనా అవగాహన ఉంది. కానీ ఇక్కడి భౌగోళిక, వాతావరణ పరిస్థితుల కారణంగా నీటి సమస్య ఉండడంతో పంటలు పెద్దగా పండవు. అందుకే వీరి భూమిలో కొంతకాలంగా పంట పండించడం లేదు. ఈయనకు కోట్‌పుత్తిలో ఓ ఆస్పత్రి ఉంది. ఐతే ఆస్పత్రికి అయ్యే కరెంట్ ఖర్చులను తగ్గించుకునేందుకు కొన్నేళ్ల క్రితం సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకున్నారు. దాని ద్వారా వారికి నెలకు రూ.15 వేలు ఆదా అయ్యేవి. అప్పుడే సోలార్ పవర్ పట్ల అమిత్ యాదవ్‌కు ఆసక్తి పెరిగింది. సౌరశక్తిని ప్రోత్సహించడం కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పీఎం కుసుం యోజన గురించి ఆయనకు తెలిసింది. మీ భూమిలో సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేసుకుంటే.. దాని నుంచి ఖచ్చితమైన రేటుకు ప్రభుత్వమే విద్యుత్‌ను కొనుగోలు చేస్తుంది. ఈ ఐడియా బాగా నచ్చడంతో.. తనకున్న రెండెకరాల భూమిలో సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేశారు అమిత్ యాదవ్.
మొత్తం 2 ఎకరాల భూమిలో 1.1 మెగా వాట్స్ సామర్థ్యమున్న సోలార్ పవర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. 330 వాట్స్ కెపాసిటీ గల 3400 సోలార్ ప్యానెల్స్‌ను అమర్చారు. ఈ ప్లాంట్‌లో ప్రతి రోజూ సగటున 5వేల యూనిట్ల కరెంట్ ఉత్పత్తి అవుతుంది. ఎండాకాలంలో రోజుకు 5,500 యూనిట్లు, శీతాకాలంలో 3500 విద్యుత్ తయారవుతుంది. సోలార్ ప్లాంట్‌లో డీసీ కరెంట్ ఉత్పత్తి అవుతుంది. దీనిని ఏసీగా మార్చి.. 3 కి.మీ. దూరంలో ఉన్న సబ్‌స్టేషన్‌కు సరఫరా చేస్తారు. అమిత్ యాదవ్ ప్లాంట్‌లో తయారయ్యే కరెంట్‌ను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. ఇందుకోసం ప్రభుత్వంతో ఆయన ఒప్పందం చేసున్నారు. 25 ఏళ్ల పాటు ఖచ్చితమైన ధర వస్తుంది. ప్రతి రోజు 5వేల యూనిట్స్ కరెంట్ తయారైతే.. దానిని యూనిట్‌కు రూ.4 చొప్పున విక్రయిస్తున్నాడు. ఇలా ప్రతిరోజూ రూ.20వేల చొప్పున.. నెలకు రూ.6 లక్షల ఆదాయం వస్తుంది.
ఐతే ఇందులో ఉన్న పెద్ద అవరోధం అంటంటే.. పెట్టుబడి. ఈ స్థాయిలో సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు కోట్లల్లో ఖర్చవుతుంది. 1 మెగా వాట్ సోలార్ సిస్టమ్‌ను ఏర్పాటు చేసేందుకు రూ.4 కోట్ల వరకు ఖర్చయింది. ఐతే ఆయన డాక్టర్‌గా పనిచేస్తున్నందున బ్యాంకులు ఈజీగా రుణం ఇవ్వడంతో పెద్దగా ఇబ్బంది పడలేదు. ఆ డబ్బుతో సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసి.. ఇప్పుడు లక్షలు సంపాదిస్తున్నారు అమిత్ యాదవ్. తానుకున్న తీసుకున్న లోన్.. ఐదేళ్లలో క్లియర్ అవుతుందని... ఆ తర్వాత వచ్చే ఆదాయమంతా లాభమేనని ఆయన చెప్పారు. సోలార్ ప్లాంట్‌ నిర్వహణకు ఇద్దరు మనుషులంటే సరిపోతుందని.. తాను డాక్టర్ వృత్తిని కొనసాగిస్తూనే.. ప్లాంట్‌ను నడుపుతున్నట్లు పేర్కొన్నారు. తాను సోలార్ ప్లాంట్‌ను ఏర్పాటు చేశాక.. మరో 200 మంది దీని పట్ల ఆసక్తి చూపించారని తెలిపారు.





Untitled Document
Advertisements