బ్యాంకు వేలంలో నకిలీ బంగారం... బాధితుడి లబోదిబో..

     Written by : smtv Desk | Sat, Jun 25, 2022, 04:21 PM

 బ్యాంకు వేలంలో నకిలీ బంగారం... బాధితుడి లబోదిబో..

బ్యాంకు వారు వేలం వేస్తున్నారు కాబట్టి మంచి నాణ్యత, ధర విషయంలో వెసులుబాటు ఉంటుందని నమ్మి బంగారు ఆభరణాలు కొనుగోలు చేశాడు. కానీ, తర్వాత పరిశీలనలో అవి నకిలీవని తేలడంతో బ్యాంకు మేనేజరుకి ఫిర్యాదు చేశాడు.. న్యాయం చేస్తామని హామీ ఇచ్చి బ్యాంకు మేనేజరు మొహం చాటేయడంతో చివరకి మీడియాను ఆశ్రయించాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన ఈ సంఘటన బ్యాంకు వారి నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపుతోంది. వివరాలు.. మణుగూరులోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖ వారు బంగారంపై లోన్లు తీసుకొని చెల్లించని వారి ఆభరణాలను మార్చిలో వేలం వేసింది. వేలంలో పాల్గొన్న ఖమ్మం జిల్లా వైరా మండలానికి చెందిన రూపాచారి 12 గాజులను పాడుకున్నాడు. వాటి ధర రూ. 6,81,500లను బ్యాంకు వారికి చెల్లించి ఆభరణాలు తీసుకున్నాడు.
తెల్లారి వాటిని పరీక్షించి చూడగా, కేవలం పైపూత మాత్రమే బంగారం.. లోపల మొత్తం ఇత్తడి, రాగి ఉండడంతో ఖంగుతిన్నాడు. పరుగుపరుగున బ్యాంకు వద్దకు వెళ్లి తనకు జరిగిన అన్యాయంపై మేనేజరు గారికి మొరపెట్టుకోగా, ఆయన పై అధికారులను సంప్రదించి తగిన న్యాయం చేస్తానని హామీ ఇచ్చాడు. అయితే మూడు నెలలు వేచి చూసిన రూపాచారి బ్యాంకు నుంచి ఎలాంటి సహాయం రాకపోవడంతో తనకు జరిగిన అన్యాయాన్ని మీడియాతో షేర్ చేసుకున్నాడు. మరి ఇప్పటికైనా బ్యాంకు వారు అసలు దొంగలను పట్టుకొని, బాధితుడికి న్యాయం చేస్తారేమో చూడాలి.





Untitled Document
Advertisements