అండర్‌-19 ప్రపంచకప్‌లో జింబాబ్వేపై భారత్‌ ఘన విజయం

     Written by : smtv Desk | Sat, Jan 20, 2018, 11:10 AM

అండర్‌-19 ప్రపంచకప్‌లో జింబాబ్వేపై భారత్‌ ఘన విజయం

మౌంట్‌ మౌంగానుయ్, జనవరి 20: అండర్‌-19 క్రికెట్ ప్రపంచకప్‌ గ్రూప్‌ దశను యువ భారత్‌ అజేయంగా ముగించింది. తొలి మ్యాచ్‌లో టోర్నీ ఫేవరెట్లలో ఒకటైన ఆస్ట్రేలియాను 100 పరుగుల తేడాతో మట్టికరిపించి.. రెండో మ్యాచ్‌లో పసికూన పపువా న్యూ గినియాను 10 వికెట్ల తేడాతో చిత్తు చేసిన భారత్‌.. తమ చివరి లీగ్‌ మ్యాచ్‌లో జింబాబ్వే పైనా చెలరేగింది. అన్ని రంగాల్లోనూ రాణించి 10 వికెట్ల తేడాతో విజయం సాధించి మరోసారి తన ఆధిపత్యాన్ని చాటింది.

గత మ్యాచ్‌లో ఐదు వికెట్ల ప్రదర్శనతో భారత్‌ విజయంలో కీలక పాత్ర పోషించిన స్పిన్నర్‌ అనుకుల్‌ రాయ్‌.. మరోసారి విజృంభించాడు. అతను 20 పరుగులే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టగా.. అర్ష్‌దీప్‌ సింగ్‌ (2/10), అభిషేక్‌ శర్మ (2/22) కూడా సత్తా చాటడంతో మొదట జింబాబ్వే 48.1 ఓవర్లలో 154 పరుగులకే కుప్పకూలింది. అనంతరం భారత్‌ గత మ్యాచ్‌లో మాదిరే వికెట్‌ నష్టపోకుండా లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది. 'మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' శుభ్‌మన్‌ గిల్‌ (90 నాటౌట్‌;59 బంతుల్లో 14×4,1×6) ఆరంభం నుంచి చెలరేగి ఆడాడు. దేశాయ్‌ (56 నాటౌట్‌; 73 బంతుల్లో 8×4,1×6) కూడా చక్కటి ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. దీంతో భారత్‌ 21.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. లీగ్‌ దశలో మూడుకు మూడు మ్యాచ్‌ల్లోనూ నెగ్గిన భారత్‌.. గ్రూప్‌-బిలో 6 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది.





Untitled Document
Advertisements