విజయవంతమైన పంత్ మోకాలికి శస్త్రచికిత్స

     Written by : smtv Desk | Sat, Jan 07, 2023, 03:59 PM

విజయవంతమైన  పంత్ మోకాలికి శస్త్రచికిత్స

ఇటీవల టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ రిషబ్ పంత్
ప్రయాణిస్తున్న కార్ ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. అయితే ఈ యాక్సిడెంట్ నుండి పంత్ క్షేమంగా బయటపడినప్పటికీ, ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. పంత్ ను తొలుత డెహ్రాడూన్ లోని హాస్పిటల్ లో చేర్చి వైద్యం అందించారు. అయితే ఆ తరువాత మెరుగైన చికిత్స కోసం పంత్ ను డెహ్రాడూన్ లోని మ్యాక్స్ హాస్పిటల్ నుంచి ముంబయిలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో, పంత్ మోకాలికి విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించారు.
కారు ప్రమాదంలో పంత్ మోకాలి లిగమెంట్ తెగిపోయినట్టు డెహ్రాడూన్ లో నిర్వహించిన వైద్య పరీక్షల్లో తేలింది. దాంతో పంత్ ను ముంబయి ఆసుపత్రికి షిఫ్ట్ చేశారు. పంత్ మోకాలికి శుక్రవారం శస్త్రచికిత్స నిర్వహించారని, సర్జరీ విజయవంతమైందని బీసీసీఐ ఓ ప్రకటనలో వెల్లడించింది. సర్జరీ అనంతర చికిత్సపై డాక్టర్ దిన్ షా పార్థీవాలా, బీసీసీఐ స్పోర్ట్స్ సైన్స్ అండ్ మెడికల్ టీమ్ సలహాలను పాటిస్తామని తెలిపింది.
పంత్ గత నెలలో ఢిల్లీ నుంచి ఉత్తరాఖండ్ వెళుతుండగా, జాతీయ రహదారిపై డివైడర్ ను ఢీకొట్టిన కారు మంటల్లో చిక్కుకుంది. హర్యానా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన సిబ్బంది సకాలంలో పంత్ ను కారు నుంచి బయటికి తీసుకురావడంతో ప్రాణాపాయం తప్పింది. పంత్ పూర్తిగా కోలుకోవడానికి కాస్త ఎక్కువ సమయమే పట్టే సూచనలు కనిపిస్తున్నాయి అనే వార్త వినిపిస్తుంది.





Untitled Document
Advertisements