టీవీ ఛానెళ్ల పై ఆగ్రహం వ్యక్తం చేసిన కేంద్ర ప్రభుత్వం.. రిషబ్ పంత్ యాక్సిడెంట్ ఎఫెక్ట్

     Written by : smtv Desk | Tue, Jan 10, 2023, 11:05 AM

టీవీ ఛానెళ్ల పై ఆగ్రహం వ్యక్తం చేసిన కేంద్ర ప్రభుత్వం.. రిషబ్ పంత్ యాక్సిడెంట్ ఎఫెక్ట్

ప్రపంచవ్యాప్తంగా రోజు ఎన్నో దుర్ఘటనలు జరుగుతున్నాయి.. హత్యలు, దాడులు, ప్రమాదాలు, రేప్ లు వంటివి రోజు ఏదో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి.. ఈ వార్తలనింటిని ప్రజలకు తెలియజేసేది.. టీవీ ఛానెళ్లు.. అయితే రోడ్డు ప్రమాదాల సమయంలో రక్తపు మడుగుల్లో పడి ఉన్న బాధితులు, మృతదేహాల ఫొటోలను బ్లర్ చేయకుండా కొన్ని టీవీ ఛానెళ్లు ప్రసారం చేస్తోన్నాయి. అయితే టీవీ ఛానెళ్లకు కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. రోడ్డు ప్రమాదాలు, మృతి, హింస, నేరాలకు సంబంధించిన వార్తలను ప్రసారం చేసేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని సూచించింది. బ్లర్ చేయకుండా రోడ్డు ప్రమాదంలో మృతుల, గాయపడిన క్షతగాత్రుల ఫొటోలు, వీడియోలను ప్రసారం చేస్తుండటంపై కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. భయం కలిగించేలా ఫొటోలు, వీడియోలను ప్రసారం చేయవద్దని సూచించింది.
ఇటీవల టీమిండియా స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఈ ప్రమాదంలో రిషబ్ పంత్‌కు తీవ్ర గాయాలవ్వగా.. అతడి ఫొటోలు, వీడియోలను బ్లర్ చేయకుండా యథావిధిగా ప్రసారం చేయడంపై కేంద్ర ప్రభుత్వం మండిపడింది. తీవ్రగాయాలు, రక్తస్రావం అయిన ఫొటోలు, వీడియోలను టీవీ ఛానెళ్లల్లో ప్రసారం చేయడం నిబంధనలకు విరుద్దమని కేంద్రం పేర్కొంది. మృతదేహాలు, రక్తపు మడుగులో ఉన్న క్షతగాత్రుల ఫొటోలు, వీడియోను బ్లర్ చేయకుండా ప్రసారం చేయడం ప్రొగ్రాం కోడ్‌కు విరుద్దమని తెలిపింది. మృతదేహాలు, రక్తం, భౌతికదాడులకు సంబంధించి సోషల్ మీడియాలో వచ్చే వీడియోలను ఎడిటింగ్ చేయకుండా యథాతధంగా కొంతమంది ప్రసారం చేస్తున్నారని కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయింది. ఇలాంటివి నిలిపివేయాలని, లేకపోతే చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఇలాంటివి ప్రసారం చేసినప్పుడు చిన్న పిల్లలు చూడటం వల్ల వారిపై చెడు ప్రభావం పడే అవకాశముందని కేంద్రం తెలిపింది. హింసాత్మక ఘటనలు చిన్న పిల్లలపై ప్రతికూల ప్రభావం చూపుతామని, అలాంటివి ప్రసారం చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని టీవీ ఛానెళ్లకు కేంద్రం సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ సూచించింది. ప్రొగ్రాం కోడ్ మార్గదర్శకాలను తప్పనిసరిగా అన్ని టీవీ ఛానెళ్లు పాటించాలని కేంద్రం సూచించింది. బాధితుల వ్యక్తిగత గోప్యతకు కూడా భంగం కలుగుతుందని, ఇలాంటివి రిపోర్టింగ్ చేయడం బాధాకరమని తన ప్రకటనలో పేర్కొంది. ఈ సందర్బంగా పలు ఘటనలను కూడా కేంద్రం గుర్తు చేసింది. రిషబ్ పంత్ ఘటనతో పాటు పంజాబీ సింగర్ సిద్దూ మూసేవా హత్య, బీహార్ రాజధాని పాట్నాలో క్లాస్‌రూమ్‌లో 5 ఏళ్ల బాలుడిని టీచర్ కొట్టిన విజువల్స్, తమిళనాడులోని విరుదునగర్ జిల్లా రాజపాళయంలో సొంత చెల్లెళ్లను ఓ వ్యక్తి చంపిన వీడియోలతో సహా అనేక ఘటనలను కేంద్రం గుర్తు చేసింది. ఇలాంటివి ప్రసారం చేయడం కలవరపెడుతుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. కేబుల్ టెలివిజన్ నెట్‌వర్క్స్ యాక్ట్-1995 ప్రకారం ప్రొగ్రాం కోడ్ నిబంధనలకు కట్టుబడి ఉండాలని ప్రైవేట్ టీవీ చానెళ్లకు కేంద్రం సూచించింది. రిషబ్ పంత్ రోడ్డు ప్రమాద ఘటన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం గమనార్హం.





Untitled Document
Advertisements