క్రికెట్ అభిమానుల ఉత్సాహం పై నీళ్ళు చిలకరించిన ఐసీసీ.. అగ్రహంలో అభిమానులు

     Written by : smtv Desk | Thu, Feb 16, 2023, 11:55 AM

క్రికెట్  అభిమానుల ఉత్సాహం పై నీళ్ళు చిలకరించిన ఐసీసీ.. అగ్రహంలో అభిమానులు

భారత క్రీడాభిమానులకు అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ భారీ షాక్ ఇచ్చింది. ముఖ్యంగా క్రికెట్ ని అమితంగా ప్రేమించే అభిమానుల ఆశలను ఆవిరి చేసింది. ప్రపంచ క్రికెట్‌ పాలనా వ్యవహారాలు చూసే అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) తప్పులో కాలేసింది. టెస్టుల్లో టీమిండియా అగ్రస్థానం సాధించిందన్న ఆనందాన్ని ఐసీసీ ఆవిరి చేసింది. టెస్టుల్లో నంబర్ వన్ ర్యాంకును దక్కించుకొని, భారత జట్టు అన్ని ఫార్మాట్లలో అగ్రస్థానం సాధించిందని అభిమానులు సంబరాలు చేసుకోగా ఐసీసీ ఒక్కసారిగా వాటిని నీరుగార్చింది.

నిన్న ప్రకటించిన టెస్ట్‌ క్రికెట్‌ తాజా ర్యాంకింగ్స్‌లో భారత్‌ నం.1 ర్యాంక్ కు చేరిందని వెల్లడించింది. తొలి టెస్ట్‌లో ఆస్ట్రేలియాపై ఇన్నింగ్స్‌ 132 పరుగులతో రోహిత్‌ సేన ఘన విజయం సాధించడంతో కంగారూలను వెనక్కు నెట్టిందని తెలిపింది. ఇప్పటికే టీ20, వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరడంతో టెస్ట్‌ల్లోనూ టాప్‌తో మూడు ఫార్మాట్లలో మన జట్టే టాప్ అంటూ అంతా ఉప్పొంగిపోయారు. బీసీసీఐ కార్యదర్శి జై షా భారత జట్టును అభినందిస్తూ ట్వీట్ చేశారు.

పలువురు కేంద్ర మంత్రులు కూడా అభినందనలు తెలిపారు. కానీ సాయంత్రానికి ఈ ఉత్సాహం అంతా నీరుగారింది. సాంకేతిక తప్పిదంతో ర్యాంకింగ్స్‌ లెక్కల్లో తేడా వచ్చినట్టు గుర్తించిన ఐసీసీ 126 పాయింట్లతో ఆసీస్‌ జట్టే టాప్‌ ర్యాంక్‌లో ఉందని పేర్కొంది. 115 పాయింట్లతో భారత్‌ రెండో స్థానంలో నిలిచిందని వెల్లడించింది. దాంతో అంతా డీలాపడిపోయారు. తన ట్వీట్ ను జై షా డిలీట్ చేశారు.

మరోవైపు ఐసీసీపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రపంచ క్రికెట్ పాలనను చూసే ఐసీసీ ర్యాంకింగ్స్ విషయంలో ఇలా తప్పులో కాలేయడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ ఇలాంటి సంఘటనలు ఎదురయ్యాయి. కాగా, శుక్రవారం మొదలయ్యే రెండో టెస్టులో ఆస్ట్రేలియాను ఓడిస్తే భారత్ టెస్టుల్లోనూ టాప్ ర్యాంక్ సాధించి అన్ని ఫార్మాట్లలోనూ నంబర్ వన్ టీమ్ అవుతుంది.





Untitled Document
Advertisements