రాహుల్ ఫామ్ లోకి రావాలంటే ఇంగ్లండ్ లో కౌంటీ క్రికెట్ ఆడటమే మార్గం.. వెంకటేశ్ ప్రసాద్

     Written by : smtv Desk | Mon, Feb 20, 2023, 12:57 PM

రాహుల్ ఫామ్ లోకి రావాలంటే ఇంగ్లండ్ లో కౌంటీ క్రికెట్ ఆడటమే మార్గం.. వెంకటేశ్ ప్రసాద్

ప్రస్తుతం టీమిండియా బ్యాట్స్ మెన్ కేఎల్ రాహుల్ ఫామ్ కోల్పోయి తీవ్రంగా ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్ట్ సిరీస్ తొలి రెండు టెస్టుల్లో రాహుల్ పూర్తిగా విఫలమయ్యాడు. తాజాగా బీసీసీఐ రాహుల్ ని వైస్ కెప్టెన్సీ నుండి కూడా తప్పించింది. ఇంకో వైపు బీకర ఫామ్ లో ఉన్న శుభ్ మన్ గిల్ ను రిజర్వ్ బెంచ్ లో కూర్చోబెట్టి కేఎల్ రాహుల్ ను ఆడిస్తుండటంపై అనేక విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఆసీస్ తో చివరి రెండు టెస్టులకు కూడా రాహుల్ ఆడతాడని హెడ్ కోచ్ ద్రావిడ్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంటో కేఎల్ రాహుల్ పై టీమిండియా మాజీ పేసర్ వెంకటేశ్ ప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు.
కేఎల్ రాహుల్ కు, తనకు మధ్య విభేదాలు ఉన్నాయని కొందరు అనుకుంటున్నారని.. అందులో నిజం లేదని వెంకటేశ్ ప్రసాద్ చెప్పారు. రాహుల్ కు అంతా మంచే జరగాలని కోరుకునే వ్యక్తుల్లో తాను కూడా ఒకడినని అన్నారు. ప్రస్తుతం ఉన్న ఫామ్ తో ఆడితే ఆయన ఆత్మవిశ్వాసం మరింత సన్నగిల్లే అవకాశం ఉందని చెప్పారు. పాత ఫామ్ ను మళ్లీ అందుకోవడం రాహుల్ కు చాలా అవసరమని.. మళ్లీ ఫామ్ లోకి రావాలంటే ఇంగ్లండ్ లో కౌంటీ క్రికెట్ ఆడటమే మార్గమని సూచించారు. ఇప్పటికే రంజీ సీజన్ ముగియడం వల్ల.. కౌంటీ క్రికెట్ లో ఆడి భారత జట్టులో మళ్లీ స్థానాన్ని సాధించుకోవాలని చెప్పారు.
టీమ్ లో పుజారా స్థానాన్ని కోల్పోయినప్పుడు ఇదే పని చేశాడని వెంకటేశ్ ప్రసాద్ గుర్తు చేశారు. పుజారాకు ఉన్నంత అనుభవం రాహుల్ కు లేదని చెప్పారు. 100 టెస్టులు ఆడిన పుజారానే పక్కన పెట్టారని.. అలాంటప్పుడు రాహుల్ ను ఇంకా ఆడించడంలో అర్థం లేదని అన్నారు. ఈ మేరకు వెంకటేశ్ ప్రసాద్ వరుస ట్వీట్లు చేశారు.





Untitled Document
Advertisements