ఆస్ట్రేలియా దే వరల్డ్ కప్

     Written by : smtv Desk | Mon, Feb 27, 2023, 01:04 PM

ఆస్ట్రేలియా దే వరల్డ్ కప్

మహిళల క్రికెట్లో ఆస్ట్రేలియా మరోసారి ఆధిపత్యం ప్రదర్శించింది. దక్షిణాఫ్రికాలో జరిగిన మహిళల టీ20 వరల్డ్ కప్ ను ఆస్ట్రేలియా కైవసం చేసుకుంది. ఆతిథ్య దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో ఆసీస్ అమ్మాయిలు 19 పరుగుల తేడాతో నెగ్గారు.

కేప్ టౌన్ లో జరిగిన టైటిల్ పోరులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 156 పరుగులు చేసింది. అనంతరం, లక్ష్యఛేదనలో సఫారీలు 20 ఓవర్లలో 6 వికెట్లకు 137 పరుగులే చేసి ఓటమిపాలయ్యారు.

ఓపెనర్ లారా ఓల్వార్ట్ 61 పరుగులు చేయగా, క్లో ట్రయోన్ 25 పరుగులు చేసింది. ఓల్వార్ట్ అవుటయ్యాక దక్షిణాఫ్రికా స్కోరు మందగించింది. ఈ ఫైనల్లో అజేయంగా 74 పరుగులు చేసిన ఆసీస్ ఓపెనర్ బెత్ మూనీ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచింది. ఆసీస్ ఆల్ రౌండర్ ఆష్లే గార్డనర్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ అవార్డు చేజిక్కించుకుంది.

కాగా, గత టీ20 వరల్డ్ కప్ లోనూ ఆస్ట్రేలియా అమ్మాయిలే విజేతలుగా నిలిచారు. తాజా విజయంతో టైటిల్ నిలబెట్టుకున్నారు. ఓవరాల్ గా ఆసీస్ మహిళల జట్టుకు ఇది 6వ టీ20 ప్రపంచకప్ కావడం విశేషం. ఆసీస్ ఇంతకు ముందు 2010, 2012, 2014, 2018, 2020లో టీ20 వరల్డ్ కప్ లు సాధించింది.





Untitled Document
Advertisements