నవదీప్, బిందుమాధవిల 'న్యూసెన్స్' - ఓటీటీ రివ్యూ

     Written by : smtv Desk | Sat, May 13, 2023, 10:48 AM

నవదీప్, బిందుమాధవిల 'న్యూసెన్స్' - ఓటీటీ రివ్యూ

ప్రస్తుతకాలం అంతా కూడా ఒటీటీ హావ నడుస్తుంది. బిగ్ స్క్రీన్ కన్నా కూడా ఓటీటీ కి డిమాండ్ రోజురోజుకి పెరుగుతూనే వస్తుంది. ఈ క్రమంలో ఈ మధ్య కాలంలో 'ఆహా' నుంచి విభిన్నమైన కథాశంతో కూడిన వెబ్ సిరీస్ లు వస్తున్నాయి. కంటెంట్ ప్రధానంగా నడిచే ఈ వెబ్ సిరీస్ లకు మంచి ఆదరణ లభిస్తూ వస్తోంది. అలా ఈ ఫ్లాట్ ఫామ్ పైకి 'న్యూసెన్స్' అనే వెబ్ సిరీస్ వచ్చింది. చాలా రోజుల నుంచి మంచి పబ్లిసిటీని చేస్తూ, సీజన్ 1 నుంచి 6 ఎపిసోడ్స్ ను నిన్న అందుబాటులోకి తీసుకుని వచ్చారు. నవదీప్ - బిందు మాధవి ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ వెబ్ సిరీస్, ఏ స్థాయిలో కనెక్ట్ అయిందనేది చూద్దాం.

ఈ కథ 'మదనపల్లి' కేంద్రంగా నడుస్తుంది. మగతోడు లేని సంసారాన్ని ఈదుతూ శివ (నవదీప్)ను అతని తల్లి పెంచి పెద్ద చేస్తుంది. అతను అక్కడి లోకల్ పేపర్ లో జర్నలిస్టుగా పనిచేస్తుంటాడు. లోకల్ టీవీలో న్యూస్ రీడర్ గా పనిచేస్తున్న లీల (బిందుమాధవి)తో అతని ప్రేమ వ్యవహారం నడుస్తుంటుంది. ఇక మదనపల్లిపై రాజకీయపరమైన పట్టును సాధించడానికి ఒక వైపున కరుణాకర్ రెడ్డి .. మరో వైపున నాగిరెడ్డి గట్టిగా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇద్దరూ కావలసినంత నేరచరిత్ర ఉన్నవారే.

ఇక మదనపల్లి పోలీస్ స్టేషన్ కి ఎవరు ఎస్.ఐ.గా వచ్చినా, ఈ ఇద్దరి వైపు నుంచి ఎలాంటి సమస్య రాకుండా వాళ్లకి అనుకూలంగా నడచుకుంటూ ఉంటారు. 'మదనపల్లి' ఒక చిత్రమైన పరిస్థితుల్లో తన మనుగడను సాగిస్తూ ఉంటుంది. శివ అతని మిత్రబృందం పెద్దలకి సంబంధించిన దారుణాలు బయటపడకుండా చేస్తూ, వాళ్ల నుంచి ఎప్పటికప్పుడు కవర్లు అందుకుంటూ ఉంటారు. మరో వైపున పోలీసులకు అందవలసిన మామూళ్లు అందుతూనే ఉంటాయి.

అటు పోలీసులను .. ఇటు జర్నలిస్టులను తమ చేతుల్లో పెట్టుకున్న రాజకీయనాయకులు ఆడింది ఆటగా .. పాడింది పాటగా నడుస్తూ ఉంటుంది. తమకున్న కొద్దిపాటి పొలం ఆక్రమణకు గురై అయ్యప్ప దంపతులు .. తన భర్త ఏమయ్యాడో తెలియక రేణుక .. తమకి జరిగిన అన్యాయాన్ని బయటపెట్టలేని సుబ్బయ్య మనవరాలు వీళ్లంతా కూడా అటు రాజకీయనాయకులు .. ఇటు పోలీసులు .. జర్నలిస్టుల మధ్య నలిగిపోతుంటారు.

అలాంటి పరిస్థితుల్లోనే మదనపల్లికి 'ఎడ్విన్' (నందగోపాల్) అనే పోలీస్ ఆఫీసర్ వస్తాడు. ఆయన రాకతో మదనపల్లిలోని వాతావరణం ఒక్కసారిగా మారిపోతుంది. అదే డిపార్టుమెంటులోని అవినీతి అధికారులలో .. రాజకీయనాయకులు .. జర్నలిస్టులైన శివ బృందంలో టెన్షన్ మొదలవుతుంది. డ్యూటీలో దిగుతూనే ఎడ్విన్ ఏం చేస్తాడు? పర్యవసానాలు ఎలా ఉంటాయి? ఎడ్విన్ విషయంలో శత్రువులంతా ఏకమై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? అనేది కథ.

మీడియా అనేది నిజాలనే చూపిస్తుందా? మీడియా చూపించేదే నిజమని నమ్మాలా? అనే ఒక సందేహాన్ని రేకెత్తిస్తూ దర్శకుడు శ్రీప్రవీణ్ కుమార్ ఈ కథను మొదలుపెట్టిన తీరు బాగుంది. మూడు బలమైన వ్యవస్థలు ఒక్కటై బలహీనులను దోచుకునే తీరును దర్శకుడు ఆవిష్కరించిన విధానం ఆసక్తికరంగా ఉంది. జనంలో నుంచి వచ్చిన సమస్యలు .. ఎవరూ ఎలాంటి పరిష్కారం చూపించనప్పుడు తమ జీవితాలకు వాళ్లు ఎలాంటి ముగింపు రాసుకున్నారు? అనేది సహజత్వానికి చాలా దగ్గరగా చిత్రీకరించాడు.

దర్శకుడు కథకి తగిన పాత్రలను ఎంచుకున్నాడు. ప్రతి పాత్రకు ప్రాధాన్యత ఉండేలా చూసుకున్నాడు. ఏ పాత్ర కూడా మేకప్ లేకుండా సహజత్వానికి దగ్గరగా కనిపిస్తుంది. రియల్ లొకేషన్స్ లో జరిగిన చిత్రీకరణ ప్రేక్షకులను మరింత కనెక్ట్ చేస్తుంది. రాజకీయనాయకుల తమ్ముళ్లు .. బావమరుదుల హవా ఎలా కొనసాగుతుందనేది కూడా బాగా చూపించాడు. కథ ఒక దగ్గర నుంచి మరొక దగ్గరికి చాలా నేచురల్ గావెళుతుంది. ఎక్కడా అతుకులు వేసినట్టుగా అనిపించదు.

కథలో ఎక్కువ పాత్రలు ఉన్నప్పటికీ, చాలా తక్కువ సమయంలోనే దర్శకుడు ప్రతి పాత్రపై ఒక క్లారిటీ వచ్చేలా చేశాడు. కొత్త పోలీస్ ఆఫీసర్ గా 5వ ఎపిసోడ్ లో 'ఎడ్విన్' ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి కథ నెక్స్ట్ లెవెల్ కి వెళుతుంది. నవదీప్ .. నందగోపాల్ నటన ఈ వెబ్ సిరీస్ కి హైలైట్. మిగతా వాళ్లంతా కూడా నటిస్తున్నట్టుగా ఉండదు. ఇంతవరకూ భారీ సినిమాలు చేస్తూ వచ్చిన పీపుల్ మీడియా వారు, ఈ వెబ్ సిరీస్ ను నిర్మించడం విశేషం. నిర్మాణ విలువల పరంగా ఎక్కడా రాజీ పడలేదు.

సురేశ్ బొబ్బిలి స్వరపరిచిన 'మైనేరు పిల్లగాడా .. ఒరకంట సుడవేమి' అంటూ సాగే పాట, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ఈ వెబ్ సిరీస్ ను నెక్స్ట్ లెవెల్ కి తీసుకుని వెళ్లింది. శ్రీనివాస్ బైనబోయిన ఎడిటింగ్ బాగుంది. అనేక పాత్రలు .. మలుపులు .. ఫ్లాష్ బ్యాక్ లు ఉన్నప్పటికీ ఎక్కడా ప్రేక్షకుడు క్లారిటీ మిస్సవ్వడు. ఇక దర్శకుడు ఎంచుకున్న లొకేషన్స్ .. ఆ లొకేషన్స్ లోని సీన్స్ ను అనంతనాగ్ .. వేదరామన్ .. ప్రసన్న గొప్పగా ఆవిష్కరించారు. వారి కెమెరా పనితనానికి మంచి మార్కులు ఇవ్వొచ్చు. ఈ మధ్య కాలంలో పెర్ఫెక్ట్ కంటెంట్ తో వచ్చిన వెబ్ సిరీస్ లలో ఒకటిగా 'న్యూసెన్స్' గురించి చెప్పచ్చు.

ప్లస్ పాయింట్స్: కథ .. కథనం .. పాత్రలను డిజైన్ చేసిన తీరు .. నవదీప్ - నందగోపాల్ నటన .. లొకేషన్స్ .. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ .. ఫొటోగ్రఫీ.

మైనస్ పాయింట్స్: అక్కడక్కడా కాస్త ఎక్కువైనట్టుగా అనిపించే హింస





Untitled Document
Advertisements