టీ20 జట్టులోకి కోహ్లీ, రోహిత్ లను తీసుకోవడం పై రైనా ఆసక్తికర వ్యాఖ్యలు!

     Written by : smtv Desk | Thu, Jan 11, 2024, 04:31 PM

 టీ20 జట్టులోకి కోహ్లీ, రోహిత్ లను తీసుకోవడం పై రైనా ఆసక్తికర వ్యాఖ్యలు!

టీమిండియా ఆటగాళ్ళు ఆఫ్ఘనిస్థా‌తో టీ20 సిరీస్‌కు సిద్దమవుతున్న విషయం తెలిసిందే. ఈ జట్టుకు ఎంపికైన ఆటగాళ్ళ విషయంలో అనేక చర్చలు జరుగుతున్నాయి. దాదాపు 14 నెలలపాటు టీ20 ఫార్మాట్‌‌కు దూరంగా ఉన్న టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్స్ విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలను ఈ టీ20 సిరీస్‌కు ఎంపిక చేయడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మంచి ఫామ్‌లో ఉన్న యువ ఆటగాళ్లను పక్కన పెట్టి వీరిని సెలెక్ట్ చేయడం ఎదురుదెబ్బ అవుతుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అయితే ఈ తరహా అభిప్రాయాలకు విరుద్ధంగా టీమిండియా మాజీ ఆటగాడు సురేష్ రైనా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు.

టీ20 వరల్డ్ కప్ సమీపిస్తున్న తరుణంలో ఆఫ్ఘనిస్థాన్‌తో టీ20 సిరీస్‌కు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను ఎంపిక చేయడం తెలివైన నిర్ణయమని సురేష్ రైనా వ్యాఖ్యానించాడు. వారిద్దరూ ఉంటే టీమ్ పటిష్ఠంగా ఉంటుందని అభిప్రాయపడ్డాడు. ప్రపంచ కప్‌కు ఆతిథ్యమివ్వనున్న అమెరికా, వెస్టిండీస్‌లలోని పిచ్‌లు కాస్త సంక్లిష్టంగా ఉంటాయని, రోహిత్, కోహ్లీల అనుభవం అక్కడి పిచ్‌లపై అక్కరకొస్తుందని అన్నాడు. విరాట్ కోహ్లీ టీ20 ఫార్మాట్‌లో 12,000 పరుగులు పూర్తి చేసుకోబోతున్నాడని అనుభవాన్ని ప్రస్తావించాడు. వారిద్దరి అనుభవం జట్టు బ్యాటింగ్‌‌కు అదనపు బలాన్ని ఇస్తుందని, టీ20 వరల్డ్ గెలిచే అవకాశాలను మెరుగుపరుస్తుందన్నాడు. ఈ మేరకు జియో సినిమా, స్పోర్ట్స్18తో మాట్లాడుతూ రైనా ఈ వ్యాఖ్యలు చేశాడు.

వన్డే ప్రపంచ కప్‌లో కోహ్లీ, రోహిత్ శర్మల ఫామ్ చాలా బాగుందని, రోహిత్ నాయకత్వంలో డ్రెస్సింగ్ రూమ్‌ వాతావరణం కూడా చాలా బావుందని రైనా ప్రస్తావించాడు. టీ20 వరల్డ్ కప్‌లో రోహిత్ శర్మ - యశస్వి జైస్వాల్‌తో ఓపెనింగ్ చేయించి విరాట్ కోహ్లీని 3వ స్థానంలో ఆడించాలని సూచించాడు. కోహ్లీ అనుభవం టీమ్‌కు బలాన్ని చేకూర్చుతుందని, ముఖ్యంగా సవాళ్లతో కూడిన అమెరికా, కరేబియన్ దేశాల్లోని పిచ్‌లపై ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని విశ్లేషించాడు. యువఆటగాళ్ల విషయానికి వస్తే యశస్తి జైస్వాల్, రింకూ సింగ్, శుభ్‌మాన్ గిల్ వంటి డేరింగ్ క్రికెటర్లు ఉన్నప్పటికీ రోహిత్, కోహ్లీ జట్టుకు బలమని రైనా అన్నాడు. ముఖ్యంగా విపరీతమైన ఒత్తిడి ఉండే వరల్డ్ కప్ లాంటి టోర్నమెంట్‌లలో అనుభవజ్ఞలు అవసరమని పేర్కొన్నాడు. ఇక రింకూ సింగ్ మెరుగుపడుతున్న తీరుపై సంతోషం వ్యక్తం చేశాడు. ఫినిషర్‌గా అద్భుతంగా రాణిస్తాడని, నిర్భయంగా షాట్లు ఆడతాడని రైనా ప్రస్తావించాడు.





Untitled Document
Advertisements