నిక్కీ హేలీకి అధ్యక్ష ఎన్నికల రేసులో ఎదురుదెబ్బ.. డొనాల్డ్ ట్రంప్‌కు కీలక విజయం

     Written by : smtv Desk | Wed, Jan 24, 2024, 12:14 PM

నిక్కీ హేలీకి  అధ్యక్ష ఎన్నికల రేసులో ఎదురుదెబ్బ..  డొనాల్డ్ ట్రంప్‌కు కీలక విజయం

మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష ఎన్నికల రేసులో అత్యంత కీలకమైన రిపబ్లికన్ ప్రైమరీ ఎలక్షన్‌లో అత్యంత కీలక విజయం సాధించారు. న్యూ హాంప్‌షైర్ ప్రైమరీని ఆయన గెలిచారు. ఈ విజయంతో రిపబ్లికన్ ప్రెసిడెన్షియల్ నామినేషన్‌ను ఖరారు చేసుకోవడానికి ఆయన చేరువయ్యారు. ఇక ఈ గెలుపుతో అధ్యక్షుడు జో బైడెన్‌తో సమానంగా ట్రంప్ నిలిచారు. నిజానికి రిపబ్లికన్ పార్టీలో ట్రంప్‌నకు ఏకైక పోటీదారుగా భావిస్తున్న నిక్కీ హేలీకి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్టు తెలుస్తోంది. నిక్కీ హేలీ రేసు నుంచి తప్పుకునే స్థాయిలో ట్రంప్ విజయం సాధించారా లేదా అనేది తెలియాల్సి ఉంది. కౌంటింగ్ ఇంకా కొనసాగుతుండడంతో ఈ విషయంలో అస్పష్టత నెలకొంది.
కాగా అధ్యక్షుడు జో బైడెన్‌ను ట్రంప్ మాత్రమే ఓడించగలరని రిపబ్లికన్లు భావిస్తున్నారు. అందుకే ఆయనకు మద్ధతు ఇస్తున్నారు. నిక్కీ హేలీ కూడా గతంలో ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అధ్యక్ష ఎన్నికల రేసులో తాను చాలా దూరంలో ఉన్నానని అన్నారు. అయితే న్యూ హాంప్‌షైర్ ప్రైమరీలో ఓటు అనుకూలంగా పడుతుందని ఆమె భావించారు. కానీ ప్రాథమిక సమాచారం ప్రకారం నిక్కీ హేలీ ఓటమి అంచున నిలిచారు. అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ట్రంప్‌పై రెండుసార్లు అభిశంసన తీర్మానాలు, ఆయనపై నాలుగు క్రిమినల్ కేసులు విచారణలో ఉన్నప్పటికీ రిపబ్లికన్లు ఆయనవైపే మొగ్గు చూపుతున్నారు.





Untitled Document
Advertisements