భారతీయ ఐటీ నిపుణులకు శుభవార్త.. హెచ్-1బీ వీసా పునరుద్ధరణకు అవకాశం

     Written by : smtv Desk | Wed, Jan 31, 2024, 08:18 AM

భారతీయ ఐటీ నిపుణులకు శుభవార్త..  హెచ్-1బీ వీసా పునరుద్ధరణకు అవకాశం

అగ్రరాజ్యం అమెరికా భారతీయ ఐటీ నిపుణులకు శుభవార్త చెప్పింది. దేశీయంగా హెచ్-1బీ వీసా పునరుద్ధరణకు అవకాశమిస్తూ ఒక పైలెట్ ప్రాజెక్టును ప్రారంభించింది. అగ్రరాజ్యం తీసుకున్న ఈ నిర్ణయం వేలాది మంది ఇండియన్ టెకీలకు ప్రయోజనం చేకూర్చే అవకాశాలున్నాయి. ఈ మేరకు యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ సోమవారం ఒక ప్రకటన రిలీజ్ చేసింది. ఈ ప్రత్యేక ప్రోగ్రామ్ జనవరి 29 నుంచి ఏప్రిల్ 1, 2024 వరకు, లేదా అన్ని అప్లికేషన్ స్లాట్‌లు నిండే వరకు ఈ రెండింట్లో ఏది ముందైతే అది చివరి తేదీగా ఉంటుందని తెలిపింది. ప్రస్తుతం రెన్యూవల్ స్టేటస్‌లో ఉన్న హెచ్-1బీ వీసాదారులు అమెరికాకు వెళ్లక ముందే భారత్‌లోనే అప్లికేషన్‌ పెట్టుకొని పునరుద్ధరించుకోవచ్చు. గతేడాది జూన్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికాలో పర్యటించిన సందర్భంగా ఈ మేరకు ప్రకటన వెలువడిన విషయం తెలిసిందే.

ప్రత్యేక ప్రోగ్రామ్ ద్వారా హెచ్-1బీ వీసాను పునరుద్ధరించుకునే అవకాశాన్ని కల్పించడం దాదాపు 20 ఏళ్లలో ఇదే మొదటిసారి. ఈ కార్యక్రమం ద్వారా వారానికి నాలుగు వేళ దరఖాస్తులు స్వీకరించనున్నట్టు తెలిపింది. అప్లికేషన్ స్లాట్లను జనవరి 29, ఫిబ్రవరి 5, ఫిబ్రవరి 12, ఫిబ్రవరి 19, ఫిబ్రవరి 26 తేదీలలో విడుదల చేస్తామని యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ తెలిపింది. సూచించిన తేదీల్లో మాత్రమే అప్లికేషన్లు స్వీకరిస్తామని, వారాంతపు పరిమితి పూర్తయ్యే వరకు మొదట స్వీకరించిన దరఖాస్తుకే ప్రాధాన్యత ఉంటుందని తెలిపింది. ఒక తేదీలో అప్లికేషన్‌ పెట్టలేని వారు మరో తేదీలో ప్రయత్నించవచ్చని వివరించింది. దరఖాస్తుదారు పాస్‌పోర్ట్, ఇతర అవసరమైన ధ్రువీకరణ పత్రాలు స్వీకరించిన తేదీ నుండి 6-8 వారాలపాటు ప్రాసెసింగ్ టైమ్ ఉంటుందని వివరించింది. పైలట్ ప్రోగ్రామ్‌లో వీసా పునరుద్ధరణ సాధ్యపడని వ్యక్తులు యూఎస్ ఎంబసీ లేదా విదేశాల్లోని కాన్సులేట్లలో దరఖాస్తు చేసుకొని హెచ్1వీసా పునరుద్ధరణను కొనసాగించవచ్చునని స్టేట్ డిపార్ట్‌మెంట్ వివరాలను వెల్లడించింది.

కాగా హెచ్-1బీ వీసా అనేది నాన్-ఇమ్మిగ్రెంట్ వీసా. అమెరికా కంపెనీలు ప్రతిభావంతులు, నైపుణ్యం కలిగిన విదేశీ ఉద్యోగులను ఈ వీసా ద్వారా నియమించుకోవడానికి అనుమతిస్తోంది. దీంతో భారత్, చైనాతో పాటు పలు దేశాలకు చెందిన వేలాది మంది నిపుణులను అమెరికా ఐటీ కంపెనీలు నియమించుకుంటున్నాయి.





Untitled Document
Advertisements