విదేశీయుల ఇళ్ల కొనుగోళ్లపై నిషేధం పొడిగించిన కెనడా ప్రభుత్వం.. కారణం ఇదేనట

     Written by : smtv Desk | Mon, Feb 05, 2024, 09:59 AM

విదేశీయుల ఇళ్ల కొనుగోళ్లపై నిషేధం పొడిగించిన కెనడా ప్రభుత్వం.. కారణం ఇదేనట

సొంతగడ్డ వదిలి ఉద్యోగాల కొరకు పరాయిదేశం వెళ్ళినారు దాదాపు అక్కడ ఇళ్ళ కొనుగోలుకు ఆసక్తి కనబరుస్తారు. తాజాగా కెనడా ప్రభుత్వం ఆ దేశంలో విదేశీయుల ఇళ్ళ కొనుగోళ్ళ పై విధించిన నిషేధాన్ని మరో రెండేళ్ల పాటు పొడిగించినట్టు అక్కడి ప్రభుత్వం ఆదివారం ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఇళ్ల ధరల పెరుగుదలతో కలత చెందుతున్న కెనడియన్ల ఆందోళన ఉపశమింపజేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది.

దేశంలోకి విదేశీయుల రాక పెరగడంతో నివాసాలకు డిమాండ్ విపరీతంగా పెరిగిందని కెనడా ప్రభుత్వం చెబుతోంది. ఫలితంగా ఇళ్లకు కొరత ఏర్పడి సామాన్య కెనడియన్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెబుతోంది. దీనికి తోడు ఖర్చులు పెరగడంతో కొత్త ఇళ్ల నిర్మాణం కూడా నెమ్మదించి పరిస్థితి మరింత జటిలంగా మారిందని అంటోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే దేశంలో విదేశీయుల సంఖ్యపై పరిమితులు విధించిన కెనడా ప్రభుత్వం ఇతర చర్యలు కూడా కొనసాగిస్తోంది.

‘‘కెనడాలో నివాసాలు మళ్లీ సామాన్యులకు అందుబాటులోకి తెచ్చేందుకు మా ముందున్న అన్ని పరిష్కారాలను అమలు చేస్తున్నాం. ఇందులో భాగంగా 2025 జనవరి 1తో ముగియనున్న ఈ నిషేధాన్ని మరో రెండేళ్ల పాటు పొడిగిస్తున్నాం’’ అని కెనడా డిప్యూటీ ప్రధాని క్రిస్టియా ఫ్రీలాండ్ ఓ ప్రకటనలో తెలిపారు. విదేశీయుల ఇళ్ల కొనుగోళ్లు కారణంగా హౌసింగ్ మార్కెట్లో ఇళ్ల ధరలు పెరిగి సామాన్యులకు అందుబాటులో లేకుండా పోతున్నాయని కెనడా ప్రభుత్వం చెబుతోంది.

వచ్చే రెండేళ్ల పాటు విదేశీ విద్యార్థులకు స్టూడెంట్ పర్మిట్ల జారీపై పరిమితి కొనసాగుతుందని గత నెల కెనడా ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.





Untitled Document
Advertisements