రష్యా రాజధానిలో పాక్ ఐఎస్ఐ ఏజెంట్.. భారత రాయబార కార్యాలయంలో విధి నిర్వహణ

     Written by : smtv Desk | Mon, Feb 05, 2024, 10:07 AM

రష్యా రాజధానిలో పాక్ ఐఎస్ఐ ఏజెంట్..  భారత రాయబార కార్యాలయంలో విధి నిర్వహణ

దేశానికి సంబంధించిన అత్యంత సున్నితమైన విషయాలలో ఎంతో జాగ్రత్త వ్యవహరిస్తుంటాయి విదేశాలలో ఉన్న రాయబార కార్యాలయాలు. అయితే రష్యా రాజధాని మాస్కోలోని భారత రాయబార కార్యాలయంలో పాకిస్థాన్‌ గూఢచార సంస్థ ఐఎస్ఐకి ఏజెంట్‌గా పనిచేస్తున్న భారత ఉద్యోగిని ఉత్తరప్రదేశ్ ఉగ్రవాద వ్యతిరేక దళం (ఏటీఎస్) అరెస్ట్ చేసింది. నిందితుడిని హాపూర్‌కు చెందిన సత్యేంద్ర సివాల్‌గా గుర్తించారు. విదేశీ వ్యవహారాలశాఖలో అతడు మల్టీ టాస్కింగ్ సిబ్బంది (ఎంటీఎస్)గా పనిచేస్తున్నాడు.

మాస్కోలోని భారత రాయబార కార్యాలయంలో గూఢచర్యం జరుగుతోందన్న సమాచారం అందుకున్న ఏటీఎస్ సివాల్‌ను పిలిపించి ప్రశ్నించింది. తొలుత సంతృప్తికర సమాధానాలు ఇవ్వని సివాల్ ఆ తర్వాత నేరాన్ని అంగీకరించాడు. డబ్బుల కోసమే తానీ పనిచేశానని, భారత ఆర్మీ రోజువారీ కార్యాలపాలకు సంబంధించిన సున్నిత సమాచారాన్ని పాకిస్థాన్ చేరవేసినట్టు తెలిపాడు.

ఇండియన్ ఎంబసీ, రక్షణ శాఖ, విదేశీ వ్యవహారాలకు సంబంధించిన కీలక, రహస్య సమాచారాన్ని కూడా అతడు పాక్ ఐఎస్ఐకి అందించి ఉంటాడని అనుమానిస్తున్నారు. సివాల్ అరెస్టుపై సమాచారం అందినట్టు విదేశాంగశాఖ తెలిపింది. దర్యాప్తు కొనసాగుతున్నట్టు పేర్కొంది.





Untitled Document
Advertisements