పరీక్షల వేళ విద్యార్థుల ఒత్తిడి తగ్గించే కొన్ని చిట్కాలు

     Written by : smtv Desk | Mon, Mar 18, 2024, 03:08 PM

పరీక్షల వేళ విద్యార్థుల ఒత్తిడి తగ్గించే కొన్ని చిట్కాలు

ఇప్పుడు పరీక్షల కాలం. పిల్లల్లో ఒకరకమైన ఆందోళన, మార్కుల గురించి భయపడుతూ ఉంటారు. ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలంటే నిద్ర లేక సరిగ్గా తినకుండా చదువుకుంటారు. అలా చేయడం వల్ల ఆరోగ్యం పాడవుతుంది. నిద్రపోకుండా చదువుకోవడం మంచిది కాదు. ఎందుకంటే ఆరోగ్యం బాగలేకపోతే పరీక్ష రాయలేం. నేర్చుకున్నది మర్చిపోయే అవకాశం ఉంది.

ఆరోగ్యకరమైన ఆహారాన్ని కొద్దికొద్దిగా తినండి. ఇది శరీరానికి బలాన్ని ఇస్తుంది. ఎక్కువసేపు చదివేందుకు ఇది ఉపయోగపడుతుంది.జంక్ ఫుడ్ వదిలివేయండి . ఇది తినడం వలన నిద్ర పోవాలి అనిపిస్తుంది . కొంతమంది పిల్లలు చదువుకునేటప్పుడు బబుల్ గమ్ లాంటివి తింటారు. ఇలా చేయకండి. ఏకాగ్రత ఉండదు. నూనెతో కూడిన ఆహారానికి కూడా దూరంగా ఉండండి. ఉదయం ఆరోగ్యకరమైన అల్పాహారం తినండి. ఎట్టి పరిస్థితుల్లోనూ బ్రేక్‌ఫాస్ట్‌ను మానేయకండి. ఎందుకంటే మీరు ఉదయం అల్పాహారం తీసుకోకపోతే అలిసిపోయి బాగా చదవడం లేదా పరీక్ష రాయడం కష్టం అవుతుంది. కరకరలాడే స్నాక్స్ తినకండి. బదులుగా డ్రై ఫ్రూట్స్ లేదా తాజా పండ్లు, తాజా పండ్ల రసాలు తీసుకోండి. పెరుగు, లస్సీ తాగండి.

తల్లిదండ్రులు పిల్లలకు ఇచ్చే ఆహారంలో ప్రొటీన్లు, ఒమేగా 3 ఫ్యాట్‌లు ఉండేలా చూడాలి. ఇవి మెదడు చురుకుగా ఉండేలా చేస్తాయి. పాల ఉత్పత్తులు, గింజలు, గుడ్లు, చేపలు తింటే మంచిది.రోజుకు కనీసం 2 లీటర్ల నీరు తాగాలి. మీరు నీరు మాత్రమే తాగకూడదనుకుంటే, తాజా పండ్ల రసం లేదా నిమ్మరసం తాగవచ్చు.కొంత మంది ఒకే సారి మొత్తం చదవాలి అని గ్యాప్ లేకుండా చదవడం కొనసాగిస్తారు . అది మిమ్మల్ని ఒత్తిడికి గురి చేస్తుంది. మీరు చదవడం నుండి అలసిపోయినట్లు అనిపించినప్పుడు విరామం తీసుకోండి. మధ్యాహ్నం పూట కునుకు తీస్తే ఫ్రెష్‌గా ఉంటారు.కష్టమైన సబ్జెక్ట్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. శారీరక శ్రమపై కూడా శ్రద్ధ వహించండి. అంటే ఒకే చోట కూర్చోకుండా, నడక, ధ్యానం చేయండి. సంగీతం వినండి, ఇవన్నీ విశ్రాంతి అనుభూతిని అందిస్తాయి.

పరీక్షలకు చదువు ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యం. 8 గంటలు నిద్రపోండి. నిద్ర తక్కువగా ఉంటే నేర్చుకున్నది మరచిపోయే అవకాశం ఉంది. బాగా నిద్రపోయి బాగా చదవండి.పరీక్షలనే భయంతో విద్యార్థులు ఒత్తిడికి గురికాకూడదు. జీవితంలో పరీక్షలు మాత్రమే మిమ్మల్ని నిర్ణయించలేవు. ఇంకా చాలా విషయాలు మిమ్మల్ని డిసైడ్ చేస్తాయి. అందుకే భయంతో ఒత్తిడిని పెంచుకోకూడదు. మీ మీద మీకు నమ్మకం ఉంటే మంచి మార్కులు సాధించవచ్చు. పరీక్షల సమయంలో ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. అప్పుడే చదివేందుకు ఆస్కారం ఉంటుంది. చదివింది మైండ్‌కు ఎక్కుతుంది. అప్పుడే పరీక్షలో మంచి మార్కులు తెచ్చుకుంటారు. సరైన ఆహారంతోపాటుగా నిద్ర మీ మెుత్తం శ్రేయస్సును డిసైడ్ చేస్తుంది.

పరీక్ష హాలులో ఎలా ప్రవర్తించాలో కూడా తెలుసుకోవాలి. పరీక్షకు ముందు రోజు అతిగా నిద్రపోకండి. వీలైనంత త్వరగా పడుకుని త్వరగా లేవండి. మీరు ఎంత బాగా నిద్రపోతే అంత రిఫ్రెష్ గా ఉంటారు. పరీక్ష రోజున వీలైనంత త్వరగా లేచి ఫ్రెష్‌గా ఉండండి.


ముందు రోజు క్రమం తప్పకుండా భోజనం చేయండి. పరీక్షకు వెళ్లే ముందు రెగ్యులర్ బ్రేక్ ఫాస్ట్ తినండి. ఖాళీ కడుపుతో వెళ్లకూడదు. ఎక్కువగా తినకండి. వీలైనంత వరకు బయటి ఆహారానికి దూరంగా ఉండాలి. ఎందుకంటే బయట తినడం మీ ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. బయట ఆహారం తీసుకుంటే తాగడానికి వేడి నీటిని వాడండి. పరీక్ష పూర్తయ్యే వరకు మీ ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి.


పరీక్షా కేంద్రానికి అవసరమైన సామాగ్రిని ముందురోజు చక్కగా చూసుకోవాలి. హాల్ టికెట్, ID, పెన్నులు, పెన్సిల్ మొదలైన వాటిని చెక్ చేసుకోవాలి. పరీక్షా కేంద్రానికి బయలుదేరే ముందు ప్రతిదీ మళ్లీ తనిఖీ చేయండి. విద్యార్థులు నిర్ణీత సమయానికి ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకోవడం మంచిది. పరీక్ష ప్రారంభానికి 30 నిమిషాల ముందు చేరుకుంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా హాయిగా పరీక్ష రాయవచ్చు. పరీక్షకు ముందు రోజు మీరు పరీక్షా కేంద్రాన్ని సందర్శించి తనిఖీ చేయాలి. తద్వారా మీరు పరీక్షా కేంద్రానికి సమయానికి చేరుకోవచ్చు.

సాధారణంగా విద్యార్థులందరూ పరీక్షకు ముందు ఎక్కువ చర్చల్లో పాల్గొంటారు. అనవసరంగా మాట్లాడటం వల్ల ఏకాగ్రత కోల్పోతారు. తాము చదివిన దానికంటే చదవని వాటి గురించి ఎక్కువగా మాట్లాడి ఆందోళనను సృష్టిస్తారు. ఎవరితోనూ అనవసరంగా మాట్లాడకండి.

పరీక్ష హాల్‌లోకి ప్రవేశించిన తర్వాత మీ హాల్ టికెట్ నంబర్‌ను తనిఖీ చేయండి. మీ సీట్లలో సౌకర్యవంతంగా కూర్చోండి. ఒక నిమిషం పాటు లోతైన శ్వాస తీసుకోండి. దీర్ఘ శ్వాస తీసుకోవడం ద్వారా మీరు ఏకాగ్రతను కాపాడుకోవచ్చు.


జవాబు పత్రాలలో తప్పులు లేకుండా రాయాలి. హాల్ టికెట్ నంబర్‌ను సరిగ్గా నమోదు చేయండి. సూపర్‌వైజర్ సంతకాన్ని పొందండి. జవాబు పత్రంపై ముద్రించిన సూచనలను తప్పకుండా చదవండి. ఒక్కసారి ప్రశ్నపత్రాన్ని పూర్తిగా చదవండి. ప్రశ్నపత్రంపై అనవసరంగా ఏమీ రాయవద్దు. ముందుగా మీకు తెలిసిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి. ప్రశ్నల సంఖ్యను సరిగ్గా నమోదు చేసి సమాధానం ఇవ్వండి. వీలైనంత వరకు ఒకటే పెన్ను ఉపయోగించండి.

పరీక్ష రాసే సమయంలో పక్కచూపులు చూడకండి. ఇన్విజిలేటర్ దృష్టిలో పడితే మీ మీదే వారి ఫోకస్ ఉంటుంది. దీంతో మీరు సరిగా పరీక్ష రాయలేరు. స్కాడ్ వచ్చి మిమ్మల్ని తనిఖీ చేస్తే భయపడకండి. మీరు ఎలాంటి తప్పు చేయనప్పుడు మీరు భయపడాల్సిన అవసరం లేదు. అయితే వారు వచ్చే ముందు మీరు ఇతరుల వైపు చూస్తే మీ మీద అనుమానం వస్తుంది. అందుకే మీ పరీక్షపైనే ఫోకస్ చేయండి. పరీక్ష హాలులో ఇతరులతో మాట్లాడేందుకు ప్రయత్నించకండి. పరీక్ష మధ్యలో ఒకటి రెండు సార్లు చిన్న విరామం తీసుకోండి. మీ గదిలోని ఇన్విజిలేటర్‌ను టైమ్ అడుగుతూ ఉండండి. దానికి అనుగుణంగా అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయాలి.


పరీక్షల సమయంలో స్నేహితులతో ఎక్కువగా మాట్లాడి సమయాన్ని వృథా చేసుకోకండి. పూర్తయిన పరీక్ష గురించి చర్చించుకుంటూ సమయాన్ని వెచ్చించకండి. వీలైనంత త్వరగా ఇంటికి చేరుకుని తర్వాతి పరీక్ష కోసం ప్రీపేర్ అవ్వండి . ఒక వేళా పరీక్ష బాగా రాయకపోయిన దీని గురించి ఆలోచించకూడదు . దాని వలన ఇంకోక ఎక్సమ్ బాగా రాసె ఛాయస్ పోతుంది . కావున ఎలాంటి ఆందోళన పడకుండా ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవ్వండి .






Untitled Document
Advertisements